ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చెందిన ఆస్తుల విభజన కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంస్థల ఆస్తుల విభజన విషయమై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ. 1,42,601 కోట్ల విలువైన ఆస్తుల విభజన విషయమై సుుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఆస్తుల విభజనకు తెలంగాణ సహకరించడం లేదని ఆ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం ఆరోపించింది.
2014లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించారు. అయితే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇంకా కొన్ని సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల మధ్య సంస్థల విబజన కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం పలు దఫాలు రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో చర్చించింది. గతంలో ప్రధాని మోడీని కలిసిన సమయంలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ సీఎం జగన్ కోరారు. రెండు రాష్ట్రాల మధ్య సంస్థల విభజన విషయమై కూడా చర్చించారు.
రాష్ట్రాల విభజన జరిగి ఎనిమిదేళ్లు జరిగినా కూడా ఆస్తుల విభజనకు సహకరించలేదని ఆ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 21లను ఏపీ ప్రభుత్వం ఆ పిటిషన్ లో పేర్కొంది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరింది ఏపీ ప్రభుత్వం.