వైఎస్ షర్మిల ఎంట్రీతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. సొంత సోదరుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వుండగా షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఏపీ రాజకీయాలు కొత్తమలుపు తిరిగాయి.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జోరు పెంచారు. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపడంతో పాటు తిరిగి కాంగ్రెస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగానే ఇవాళ్టి(మగళవారం) నుండి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.
జనవరి 23 నుండి 31 వరకు అంటే తొమ్మిదిరోజుల పాటు షర్మిల వివిధ జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం శ్రీకాకుళం జిల్లా నుండే ఆమె పాదయాత్ర ప్రారంభమయ్యింది. ఉదయమే ఇచ్చాపురంకు చేరుకున్న షర్మిల జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. ప్రస్తుతం శ్రీకాకుళంలో కాంగ్రెస్ పరిస్థితి గురించి తెలుసుకున్న షర్మిల బలోపేతానికి ఏం చేయాలో కూడా చర్చిస్తున్నారు.
Also Read నేను ఎవరో వదిలిన బాణాన్ని కాను.. నా టార్గెట్ నాకుంది : వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఇక మద్యాహ్నం షర్మిల పార్వతీపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులతో కూడా షర్మిల సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రానికి విజయనగరం చేరుకోనున్నారు షర్మిల. ఆ జిల్లా నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇలా ఇవాళ ఉదయం నుండి రాత్రి వరకు షర్మిల జిల్లాల పర్యటన కొనసాగనుంది.
జిల్లాలవారిగా షర్మిల పర్యటన వివరాలు :
జనవరి 23 - శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం
జనవరి 24 - విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి
జనవరి 25 - అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్ఛిమ గోదావరి
జనవరి 26 - తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్
జనవరి 27 - గుంటూరు, పల్నాడు
జనవరి 28 - బాపట్ల, ప్రకాశం, నెల్లూరు
జనవరి 29 - తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య
జనవరి 30 - శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూల్
జనవరి 31 - నంద్యాల, వైఎస్సార్ కడప