జగన్ రెడ్డి హయాంలో ఏపీ పూర్తిగా నాశనమైంది: వైకాపా స‌ర్కారుపై చంద్రబాబు ఫైర్

By Mahesh RajamoniFirst Published Dec 2, 2022, 5:59 AM IST
Highlights

Rajamahendravaram: జగన్ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజలందరూ ఏకమై ధైర్యంగా రోడ్లపైకి రావాలని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. కేసులు, అణచివేతలకు భయపడి మౌనంగా ఉంటే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆయన ప్రజలను హెచ్చరించారు.
 

Nara Chandrababu Naidu:  వైకాపా అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైందనీ, తరతరాలుగా ప్రజలు కోలుకోలేని విధంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. "ఇదెం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చేరుకున్న చంద్రబాబు భారీ రోడ్ షోను చేపట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్ర వైకాపా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల దాడిచేశారు. జగన్ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజలందరూ ఏకమై ధైర్యంగా రోడ్లపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేసులు, అణచివేతలకు భయపడి మౌనంగా ఉంటే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆయన ప్రజలను హెచ్చరించారు. 2014-19 మధ్య ఐదేళ్లలో రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల పెట్టుబ‌డులు,  ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. తాను పోలవరం ప్రాజెక్టు స్థలాన్ని 23 సార్లు సందర్శించాననీ, పోలవరం ప్రాజెక్టును చాలా జాగ్రత్తగా నిర్మించామని ఆయన చెప్పారు.

 

సైకో పాలన వద్దు.. సైకిల్ పాలన కావాలి... - pic.twitter.com/ZZFM1F9ZBG

— Telugu Desam Party (@JaiTDP)

జగన్ రెడ్డి పాలనలో పోలవరం భ్రష్టుపట్టిందనీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే డయాఫ్రం గోడ కొట్టుకుపోయిందని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజల 70 ఏళ్ల కల. జగన్ ప్రభుత్వం ఆ కలను బహుళార్థసాధక ప్రాజెక్టుగా మార్చడానికి బదులుగా బ్యారేజీగా కుదించి నాశనం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ రంగాన్ని వదిలిపెట్టలేదనీ, తన అత్యాశ, అహంకారానికి సర్వస్వం త్యాగం చేశారని చంద్రబాబు అన్నారు. తరిమికొట్టడం సులభం, తీసుకురావడం కష్టమని, నిర్మించడం కష్టమని, కూల్చివేయడం సులభమని చంద్రబాబు ముఖ్యమంత్రి పనితీరును ఎగతాళి చేశారు.

సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలా.. అప్పులపాలు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని  చంద్రబాబు అన్నారు. జగన్ సైకో పాలనను తరిమికొట్టి మళ్లీ సైకిల్ పాలన తీసుకొస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు. 

 

గురువారం టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడిని పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో  చంద్రబాబు వాగ్వాదానికి దిగారు.  అంతేకాదు రోడ్డుపై బైఠాయించి  చంద్రబాబు ధర్నాకు దిగారు.రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రివర్స్ టెండరింగ్  పేరుతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ఆయన ఆరోపించారు. ఏ కారణంతో  పోలీసులు తనను అడ్డుకున్నారో  చెప్పాలన్నారు. పోలవరంలోనే  ఏడు మండలాలను కలిపితేనే తాను సీఎంగా ప్రమాణం చేస్తానని  చెప్పడంతో  ఆనాడు ఎన్డీఏ సర్కార్ ఏడు మండలాలను  ఏపీలో  కలిపిందన్నారు.

click me!