ప్రజల ఆశీస్సులున్నంతవరకు ఏమీ చేయలేరు: భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ శంకుస్థాపన

By narsimha lode  |  First Published May 3, 2023, 12:16 PM IST

భోగాపురం ఎయిర్ పోర్టుకు  ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇవాళ  శంకుస్థాపన  చేశారు.  ఈ ఎయిర్ పోర్టును తానే  ప్రారంభిస్తానని  జగన్ ఆశాభావం వ్యక్తం  చేశారు.  
 


విజయనగరం:  ప్రజల ఆశీస్సులు   ఉన్నంత వరకు  ఎవరు  ఎన్ని కుట్రలు  చేసినా  పనిచేయవని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. బుధవారంనాడు బోగాపురం ఎయిర్ పోర్టుకు  ఏపీ సీఎం వైఎస్ జగన్  శంకుస్థాపన  చేశారు.  ఈ సందర్భంగా  నిర్వహించిన  సభలో   సీఎం  జగన్  ప్రసంగించారు. ఎన్నికల మేనిఫెస్టోలో   98.5 శాతం అమలు చేసినట్టుగా  జగన్  చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినందునే  మీ ముందుకు  వచ్చి అడిగే అర్హత  తమకే ఉందని  జగన్  అభిప్రాయపడ్డారు.   ఏ మంచి చేయని చంద్రబాబుకు  దుష్టచతుష్టయం మద్దతు ఇస్తుందని  జగన్ విమర్శించారు.  ఏ మంచి  చేయని చంద్రబాబుకు  దత్తపుత్రుడు ఎందుకు సహకరిస్తున్నాడని  ఆయన  పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.  

 ఓ వైపు పేదవాడి ప్రభుత్వం, మరో వైపు పెత్తందారుడికి మద్దతు తెలిపే పార్టీలున్నాయన్నారు.  పేదవాడికి ఇంగ్లీష్  చదువు అందిస్తున్న తాము ఒక వైపు పేదలకు  ఇంగ్లీష్ చదువులు వద్దని భావించే వర్గం  మరో వైపు ఉందని  సీఎం జగన్  చెప్పారు.  

Latest Videos

undefined

గత  ప్రభుత్వానికి  తమ ప్రభుత్వానికి మధ్య  తేడాను  చూడాలని  ఏపీ సీఎం జగన్  ప్రజలను కోరారు.  తమ ప్రభుత్వంలో మంచి జరిగిందని  భావిస్తేనే  తనను ఆశీర్వదించాలని  జగన్ ప్రజలను  కోరారు.గత ఎన్నికల్లో టీడీపీకి  ఓటేసిన వారి ఇంటికి వెళ్లి సైతం తాము ఇదే విషయాన్ని అడగగలమన్నారు.సీఎంగా  ఉన్న కాలంలో  ఏం చేశారో చెప్పుకోవడానికి  చంద్రబాబుకు ఏమీ లేదని  ఆయన  ఎద్దేవా  చేశారు.  విశాఖపట్టణం అందరికీ ఆమోదయోగ్యమైన నగరమని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి విశాఖ నుండి పాలనను  ప్రారంభించనున్నట్టుగా తెలిపారు. 

  2026లో  ఈ ఎయిర్ పోర్టును తాను  ప్రారంభించనున్నట్టుగా  సీఎం జగన్  ఆశాభావం  వ్యక్తం  చేశారు.  మెడికల్, టూరిజం, ఐటీ,  ఇండస్ట్రీకి  భోగాపురం కేంద్ర బిందువుగా మారనుందని జగన్  చెప్పారు.  

చంద్రబాబునాయుడు  ఎన్నికలకు రెండు మాసాల ముందు  హడావుడిగా  శంకుస్థాపన  చేశారని ఆయన విమర్శించారు.  భోగాపురం ఎయిర్ పోర్టుకు  ఎలాంటి అనుమతులు తీసుకొకుండానే  శంకుస్థాపనలు  చేశారని ఆయన ఆరోపించారు.   కానీ తమ ప్రభుత్వం భోగాపురం ఎయిర్ పోర్టుకు  అన్ని రకాల అనుమతులు తీసుకుందని ఆయన  గుర్తు చేశారు.   భోగాపురం ఎయిర్ పోర్టు పనులకు  ఆటంకం కల్గించేందుకు గాను  కోర్టుల్లో కేసులు వేశారని సీఎం జగన్  పరోక్షంగా టీడీపీ నేతలపై వ్యాఖ్యలు  చేశారు. 

ఒకప్పుడు  ఉత్తరాంధ్ర అంటే  వలసలు గుర్తొచ్చేవన్నారు.  కానీ రాబోయే  రోజుల్లో  ఉత్తరాంధ్ర  జాబ్ హబ్ గా మారబోతోందని ఆయన  ఆశాభావం వ్యక్తం  చేశారు.  

ఉత్తరాంధ్ర అంటే బ్రిటీషర్లను గడగడలాడించిన  అల్లూరి జన్మించిన  గడ్డగా  ఆయన  గుర్తు  చేశారు.  అందుకే  కొత్తగా  ఏర్పాటు  చేసిన  జిల్లాకు  అల్లూరి పేరు పెట్టుకున్నామన్నారు.  కిడ్నీ సమస్యలు  రాకుండా ఇచ్ఛాపురం  పలాస ప్రాంతాలకు  రక్షిత  తాగు నీటిని అందించినట్టుగా  వైఎస్ జగన్  చెప్పారు. మరో రెండు నెలల్లో కిడ్నీ  రీసెర్చ్ సెంటర్లను కూడా జాతికి అంకితం చేస్తామని  సీఎం హామీ ఇచ్చారు.  

భోగాపురం ఎయిర్ పోర్టులో  డబుల్ డెక్కర్ ఫ్లైట్   ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు  చేస్తామన్నారు.  24 నుండి  30 నెలల్లో  ఎయిర్ పోర్టును  పూర్తి చేస్తామని  జీఎంఆర్ గ్రూప్ చెప్పిందని  సీఎం  జగన్  ప్రకటించారు.  

కురుపాంలో  ట్రైబల్ ఇంజనీరింగ్  కాలేజీ పనులు  వేగంగా  జరుగుతున్నాయని  సీఎం జగన్  చెప్పారు.పార్వతీపురం, విజయనగరం, నర్సీపట్నంలో  మెడికల్ కాలేజీ పనులు జరుగుతున్నాయన్నారు.  పాడేరులో ట్రైబల్  మెడికల్ కాలేజీ పనులు కొనసాగుతున్నాయని  సీఎంజగన్ గుర్తు  చేశారు. మరో  24 నెలల్లో  మూలపేట పోర్టును జాతికి అంకితం చేస్తామని జగన్   చెప్పారు.


మొదటి ఫేజ్ లో  రూ. 4600 కోట్ల పెట్టుబడి

ఫేజ్-1 లో  రూ. 4600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టును  జీఎంఆర్ సంస్థ  నిర్మించనుంది.   ఆరు మిలియన్  ప్యాసింజర్  కెపాసిటీతో  ఎయిర్ పోర్టును నిర్మించనున్నారు. 2,203  ఎకరాల్లో భోగాపురం ఎయిర్ పోర్టును నిర్మించనున్నారు.  

భోగాపురం ఎయిర్ పోర్టుతో పాటు  చింతపల్లి  ఫిష్ ల్యాండింగ్  సెంటర్ కు  కూడా  సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 2373 కోట్లలో  చింతపల్లి  ఫిష్ ల్యాండింగ్  సెంటర్ ను నిర్మించనున్నారు.  గతంలో  చంద్రబాబునాయుడు  సీఎంగా  ఉన్న సమయంలో భోగాపురం ఎయిర్ పోర్టుకు  శంకుస్థాపన  జరిగింది.   

click me!