టీడీపీ ఖాతాలోకి ఆ నిధులెలా వచ్చాయి: ఏపీ సీఐడీ నోటీసులు

By narsimha lode  |  First Published Nov 14, 2023, 3:32 PM IST

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు పంపారు.  టీడీపీ ఖాతాల్లోకి వచ్చిన  నిధుల గురించి వివరాలను  ఇవ్వాలని  ఆ నోటీసులో కోరారు సీఐడీ అధికారులు.


అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు  ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మంగళవారంనాడు నోటీసులు జారీ చేశారు.  తెలుగుదేశం (టీడీపీ) బ్యాంకు ఖాతాల వివరాలు అందించాలని  ఆ నోటీసులో  సీఐడీ కోరింది.తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి ఆశోక్ బాబుకు  సీఐడీ కానిస్టేబుల్  నోటీసు ఇచ్చి వెళ్లారు.ఈ నెల  18వ తేదీలోపుగా  వివరాలు ఇవ్వాలని  ఆ నోటీసులో  కోరారు.

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసు  కేసుకు సంబంధించి  టీడీపీ ఖాతాకు వచ్చిన వివరాలు కావాలని  సీఐడీ ఆ నోటీసులో కోరింది. తెలుగుదేశం పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాల వివరాలను ఇవ్వాలని  కోరింది. అంతేకాకుండా టీడీపీకి వచ్చిన విరాళాలను కూడ అందించాలని   ఆ నోటీసులో తెలిపింది.  తెలుగుదేశం పార్టీకి  అందిన విరాళాల గురించి ఏపీ సీఐడీ ప్రశ్నించడంపై  ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest Videos

undefined

ఇదిలా ఉంటే సీఐడీ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని  తెలుగుదేశం పార్టీ  నేతలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు ఏపీ సీఐడీ  ఇచ్చిన నోటీసులను కూడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి తీసుకురావాలని ఆ పార్టీ భావిస్తుంది.ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిని  ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.  ఈ కేసులో  ఈ ఏడాది అక్టోబర్  31న చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.  ఈ నెల  28వ తేదీ వరకు  చంద్రబాబుకు  మధ్యంతర బెయిల్ ను ఇచ్చింది  ఏపీ హైకోర్టు.  ఈ నెల  28వ తేదీన సాయంత్రం లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే  ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి  టీడీపీ ఖాతాలోకి వచ్చిన నిధుల విషయమై  సీఐడీ అధికారులు  నోటీసులు జారీ చేయడంతో  రానున్న రోజుల్లో ఈ కేసు దర్యాప్తు తీరుపై ఉత్కంఠ నెలకొంది. 

చంద్రబాబుపై  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు కాకుండా , ఏపీ ఫైబర్ నెట్ కేసు, అంగళ్లు కేసు, మద్యం తయారీ కంపెనీల అనుమతుల విషయంలో  అక్రమాలపై , ఇసుక విధానంలో అక్రమాలు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు పై  కేసులు నమోదైన విషయం తెలిసింది.

also read:ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 15 వ తేదీకి వాయిదా

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ  చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఈ వారంలో  సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.

click me!