ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్. షర్మిల తన సోదరుడు జగన్ పై విమర్శలు చేశారు. దీనికి సీఎం జగన్ కూడ పరోక్షంగా కౌంటరిచ్చారు.
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా సంఘాలకు నాలుగో విడత నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఉరవకొండలో విడుదల చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విపక్షాలపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రాన్ని చీల్చిన పార్టీలో కూడ చంద్రబాబు అభిమానులు కొందరు స్టార్ క్యాంపెయినర్లుగా తయారయ్యారని ఆయన సెటైర్లు వేశారు. వై.ఎస్. షర్మిల, కాంగ్రెస్ పార్టీ పేర్లు ప్రస్తావించకుండా స్టార్ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్ పరోక్ష విమర్శలు చేశారు. చంద్రబాబును జాకీలు పెట్టి పైకెత్తేందుకు చాలా మంది పనిచేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
అమరావతిలో చంద్రబాబు భూములకు బినామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ, ఇతర పార్టీల్లోనూ చంద్రబాబుకు కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని సీఎం జగన్ విమర్శించారు.పలు వేదికలపై విశ్లేషకులు,మేథావుల పేర్ల మీద వీరే బయటకు వస్తారన్నారు. జెండాలు జతకట్టడమే వారి అజెండా అని సీఎం జగన్ విమర్శించారు. జనం గుండెల్లో గుడి కట్టడమే తన అజెండాగా సీఎం జగన్ చెప్పారు.మీరే తన స్టార్ క్యాంపెయినర్లు అంటూ జగన్ తేల్చి చెప్పారు.
also read:వైఎస్ఆర్‌సీపీకి నరసరావుపేట ఎంపీ షాక్: పార్టీకి, ఎంపీ పదవికి లావు కృష్ణ దేవరాయలు రాజీనామా
తనకున్న స్టార్ క్యాంపెయినర్లు రాజకీయ చరిత్రలో ఉండరని ఆయన తెలిపారు.చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువగా ఉన్నారన్నారు. చంద్రబాబు వదిన కూడ ఆయనకు స్టార్ క్యాంపెయినరేనని చెప్పారు. పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు కూడ చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు కొందరు బీజేపీలో తలదాచుకున్నారని ఆయన విమర్శించారు.రాబోయే ఎన్నికల్లో మీరే నా సైనికులు అంటూ ఆయన ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. మళ్లీ వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే మంచి పనులు కొనసాగుతాయన్నారు.
జెండాలు జతకట్టడమే అజెండా…
జనం గుండెల్లో గుడికట్టడమే మీ అజెండా…♥️☝🏻 pic.twitter.com/y7GDGivepB
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను వై.ఎస్. షర్మిల ఈ నెల 21న చేపట్టారు. పార్టీ బాధ్యతలు చేపట్టిన రోజునే ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై షర్మిల విమర్శలు ఎక్కు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్దితో పాటు ఇతర అంశాలను ఆమె ప్రస్తావించారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏం చేశారని ఆమె జగన్ పై ఆరోపణలు చేశారు.
ఈ నెల 4వ తేదీనే వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో అదే రోజున విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను షర్మిలకు అప్పగించింది. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే తన తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కోరిక అని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.