ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిల విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చించారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారంనాడు ఉదయం పార్లమెంట్ ఆవరణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బీజేపీ అగ్రనేతలతో భేటీ అయిన రెండు రోజుల తర్వాత సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.రాష్ట్రానికి రావాల్సిన నిధులు,పెండింగ్ బకాయిలపై ప్రధాన మంత్రితో సీఎం జగన్ చర్చించనున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రానికి రావాల్సిన నిధులు,ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల,తెలంగాణ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిల విడుదల, కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాపై కూడ చర్చించనున్నారని సమాచారం.
also read:రాజ్యసభ ఎన్నికలు: వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు వీరే
రెండు రోజుల క్రితం బీజేపీ అగ్రనేతలతో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డాతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఈ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ కూడ టీడీపీ, జనసేన కూటమితో కలిసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు.
also read:బీజేపీ నేతలతో బాబు భేటీ,మరునాడే ఢిల్లీకి జగన్: ఎందుకో తెలుసా?
చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతలతో సమావేశమైన రెండు రోజులకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడ సీఎం జగన్ భేటీ కానున్నారు.