
Andhra Pradesh: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు పై వైఎస్ఆర్‌సీపీ నాయకుడు, రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మళ్లీ సీఎం కాలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని పాదయాత్రలు, బస్ యాత్రలు, సైకిల్ యాత్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మీద పూర్తి నమ్మకంతో ప్రజలు ఉన్నారని తెలిపారు. రానున్న 30 ఏళ్ళు వైసీపీయే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్ని తపస్సులు చేసిన సీఎం కాలేరని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
రాష్ట్రంలో ప్రతి సున్నితమైన విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయాలని చూస్తోందని అంతకుముందు రోజు మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అలాగే, రేపల్లె రైల్వేస్టేషన్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచార ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు.ఈ ఘటనపై ప్రతిపక్షాల రాజకీయం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాల తీరును ఖండిస్తూ.. ప్రతిపక్షాలు రేపల్లే ఘటనపై శవ రాజకీయాలు చేస్తున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ శవాలు దొరుకుతాయా అని రాజకీయాలు చేయడానికి చూస్తున్నాయని ఆరోపించారు. ‘‘బాధితుల వివరాలను బహిర్గతం చేస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదయ్యాయో లెక్క చూసుకోవాలి. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడలేదా..? బాధితులకు ఇచ్చే పరిహారం విషయాన్ని కూడా రాజకీయాలు చేయటం సరికాదు" అంటూ పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే పోలీసులు నిందితులను అరెస్టు చేశారని తెలిపారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామనీ, ఆమె గర్భవతి ఉందనీ, అన్ని పరీక్షలు చేశామనీ, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంత్రి సొంతంగా రూ.2 లక్షలు సాయం అందించారు. కాగా, రేపల్లె రైల్వేస్టేషన్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచార ఘటనపై ప్రతిపక్షాలు, ప్రజా, దళిత సంఘాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
కాగా, ఉపాధి వెతుక్కుంటూ గుంటూరు నుంచి క్రిష్ణా జిల్లాకు వెళ్లుతున్న ఓ కుటుంబం విషాదంలో మునిగింది. శనివారం, ఆదివారాల మధ్య రాత్రిపూట ట్రైన్ కోసం ఓ రైల్వే స్టేషన్‌లో ముగ్గురు పిల్లలతో గర్భిణి, ఆయన భర్త ఎదురుచూస్తున్నారు. స్టేషన్‌లోని బెంచీలపై పడుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఓ మూక ఆ స్టేషన్‌లోకి వచ్చింది. వారిని లేపింది. తన భార్య దగ్గరకు వెళ్లగానే భార్త వారిని అడ్డుకోబోయాడు. దీంతో ఆ ముగ్గురూ ముందుగా భర్తను తీవ్రంగా బాదారు. ఆ తర్వాత ఆయన భార్య, గర్భిణినిపై దాడి చేశారు. భర్త అక్కడి నుంచి ఎస్కేప్ అయి రైల్వే స్టేషన్‌లోని అధికారులు, పోలీసుల కోసం అరిచాడు. సహాయం కోసం వెతికాడు. కానీ, ఏ ఒక్క అధికారి కూడా కనిపించలేదు. తిరిగి వచ్చే సరికి తన భార్య అక్కడ లేదు. సమీపంలోని పొదల్లో కనిపించింది. ఆ ముగ్గురూ ఆమెపై గ్యాంగ్ రేప్ చేసినట్టు సమాచారం.