శాసనమండలికి సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులు: అడ్డుకొనేందుకు టీడీపీ వ్యూహం, ఏం జరుగుతోంది?

By narsimha lodeFirst Published Jun 17, 2020, 10:36 AM IST
Highlights

 ఏపీ శాసమండలిలో సీఆర్‌డీఏ రద్దు బిల్లు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులను  ప్రభుత్వం బుధవారం నాడు ప్రవేశపెట్టనుంది. అయితే ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని ఇదివరకే శాసమండలి కోరింది.

అమరావతి:  ఏపీ శాసమండలిలో సీఆర్‌డీఏ రద్దు బిల్లు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులను  ప్రభుత్వం బుధవారం నాడు ప్రవేశపెట్టనుంది. అయితే ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని ఇదివరకే శాసమండలి కోరింది. మరో వైపు ఈ విషయమై కోర్టులో కేసులు ఉన్నాయి. ఈ తరుణంలో నిన్న అసెంబ్లీలో ఆమోదం పొందిన సీఆర్‌డీఏ రద్దు బిల్లు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులను మరోసారి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం చూడడం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ ఏడాది జనవరి 20వ తేదీన అసెంబ్లీలో ఈ రెండు బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఆ తర్వాత ఈ బిల్లులను శాసమండలిలో ప్రవేశపెట్టారు.  అయితే ఈ బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపారు. 

also read:బాబుకు షాక్: సీఆర్‌డీఏ రద్దు, సమగ్రాభివృద్ధి బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

అయితే సెలెక్ట్ కమిటిని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఈ విషయమై శాసమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ గవర్న్ కు కూడ ఫిర్యాదు చేశారు.సెలెక్ట్ కమిటి ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ రెండు బిల్లులను మరోసారి ప్రవేశపెట్టకూడదని నిన్న బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఈ బిల్లులను ప్రవేశపెట్టిన సమయంలో టీడీపీ సభ్యులు అసెంబ్లీలో లేరు. అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందింది.

శాసనమండలిలో 178 నిబంధన కింద మరోసారి ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టుగా అధికార వైసీపీ చెబుతోంది. సాధారణ పరిస్థితుల్లో 178 నిబంధన కింద ఈ బిల్లులు ప్రవేశపెట్టడం సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. కానీ, ప్రత్యేక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ రెండు బిల్లులు మండలిలో ప్రవేశపెట్టడం సాధ్యం కాదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని గవర్నర్ ప్రసంగంపై సవరణలు చేస్తూ తీర్మానాన్ని కూడ ఈ నెల 16వ తేదీన శాసనమండలి ఆమోదించిన విషయం తెలిసిందే. శాసనమండలిలో అసలు ఏం జరుగుతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

సీఆర్డీఏ, పరిపాలన వికేంద్రకరణ రెండు బిల్లులను మళ్లీ అడ్డుకుంటామని  శాసనమండలిలో టీడీపీ  విప్ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. అమరావతి ఎప్పటికీ ఇక్కడ నుంచి తరలిపోకుండా చూస్తామన్నారు. రాజధాని కోసం ఎంతవరకు అయినా పోరాడుతామన్నారు. జగన్ విశాఖ వస్తుంటే అక్కడ ప్రజలు భయపడిపోతున్నారన్నారు. సెలెక్ట్ కమిటీ, హై‌కోర్టులో ఉండగా మళ్ళీ బిల్లులను ఎలా మండలికి పంపిస్తారని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

 సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు మళ్లీ శాసనమండలిలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం  తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ, శాసన ప్రక్రియలో ఉన్నాయని గవర్నర్‌ ప్రసంగంలో చెప్పారు. 

ఆ బిల్లులు సెలెక్ట్‌ కమిటీ వద్ద ఉన్నాయని హైకోర్టులో ప్రభుత్వం చెప్పింది. మళ్లీ ఆ బిల్లును సభలో ఎలా ప్రవేశపెడతారని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్‌ 197 ద్వారా మండలిలో ప్రవేశపెట్టడం కూడా రాజ్యాంగ విరుద్ధమేనన్నారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.

 సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలి ఆమోదించలేదు.. తిరస్కరించ లేదు. సవరణలు కూడా ప్రతిపాదించలేదు.. కేవలం సెలెక్ట్‌ కమిటీకి పంపించిందని ఆయన గుర్తు చేశారు.

మండలి ఆమోదించినా, తిరస్కరించినా.. లేదా.. సవరణలు ప్రతిపాదించినప్పుడు మాత్రమే బిల్లులను తిరిగి ప్రవేశపెట్టాలి. సెలెక్ట్‌ కమిటీ వేయకుండా కార్శదర్శి వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

ఆ ఫిర్యాదుకు అనుగుణంగానే గవర్నర్‌ కూడా కొన్ని చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం సెలెక్ట్‌ కమిటీని నియమించి ఉంటే ఇప్పటికే కాలపరిమితి పూర్తయ్యేది. నేడు ఆ బిల్లులను మళ్లీ ప్రవేశపెడితే ఏం చేయాలన్నదానిపై వ్యూహం రచిస్తాం. ప్రభుత్వ వ్యూహాలకు ప్రతివ్యూహలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

click me!