ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 : షెడ్యూల్ , పోలింగ్ , ఫలితాలు .. ముఖ్యమైన తేదీలివే

By Arun Kumar P  |  First Published Mar 16, 2024, 4:59 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లోని 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్, మే 13న పోలింగ్  జరపనున్నట్లు ఈసి ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. 


దేశంలో లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీనితో పాటు ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అయిన 26 అసెంబ్లీ స్థానాలను భర్తీ చేసేందుకు కూడా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది . గుజరాత్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ 26 నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. 

ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడంతో తెలంగాణలోని కంటోన్మెంట్ స్థానానికి మే 13న ఉపఎన్నికల నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగో విడతలో భాగంగా మే 13న ఏపీలోని 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే అదే రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వుంటుందని సీఈసీ తెలిపింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా బరిలో దిగుతుండగా.. వైసీపీ మాత్రం ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తోంది.

Latest Videos

2019లోనూ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2019లో మార్చి 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై 7 విడతల్లో పోలింగ్ జరిగింది. ఏపీలో మాత్రం మొదటి విడతలోనే ఏప్రిల్ 11న పోలింగ్ జరగ్గా.. ఏప్రిల్ 23న కౌంటింగ్ నిర్వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాలకు గాను 151 చోట్ల వైసీపీ విజయం సాధించగా టీడీపీ 23 చోట్ల, జనసేన ఒకచోట విజయం సాధించాయి. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలోని 25 స్థానాలకు వైసీపీ 22 చోట్ల , టీడీపీ 3 చోట్ల విజయం సాధించాయి. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు  : ముఖ్యమైన తేదీలు

  • ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్
  • ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
  • ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన
  • ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
  • మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
  • జూన్ 4న ఓట్ల లెక్కింపు

దేశవ్యాప్తంగా 97 కోట్ల ఓటర్లు నమోదు చేసుకోగా.. ఓటింగ్ కోసం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. దాదాపు కోటిన్నర మంది అధికారులు ఎన్నికల ప్రక్రియలో భాగంగా కానున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు సిద్ధం చేస్తామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం వున్న వారికి ఇంటి నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 

 

SCHEDULE for General Elections to Andhra Pradesh Legislative Assembly. Details 👇 pic.twitter.com/HBP4HWIyuA

— District Election Officer Vizianagaram (@election_vzm)

 

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇకపై ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది. షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను వేగవంతం చేసే అవకాశం వుంది.  

click me!