
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. నేడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం జగన్, మంత్రులు బుగ్గన, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. మార్చి 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 13 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి గౌరవ సూచకంగా ఈనెల 9వ తేదీన సభకు సెలవుగా ప్రకటించారు.
ఇక, బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారని సమాచారం. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంచి పద్ధతి కాదని అచ్చెన్నాయుడికి సీఎం జగన్ హితవు పలికారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదని జగన్ అన్నట్టుగా తెలుస్తోంది.
ఇక, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉగాది నుండి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుందని ప్రకటించారు. వీకేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ది సాగుతుందని చెప్పారు. గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కౄషి చేస్తోందని తెలిపారు. కొత్త జిల్లాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. రాష్ట్రం అభివృద్ది పథంలో పయనిస్తుందని గవర్నర్ చెప్పారు. విద్య,వైద్యం, వ్యవసాయ రంగాల్లో మైరుగైన అభివృద్దిని సాధించామన్నారు. Coronaతో దేశం, రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పాలనను కిందిస్థాయి వరకు వర్తింపసేసేలా గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయని గవర్నర్ చెప్పారు.
ప్రభుత్వానికి ఉద్యోగులను మూల స్థంభాలుగా తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. అందుకే ఉద్యోగుల వయో పరిమితిని 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచామని గవర్నర్ చెప్పారు. 2020-21 నుండి మన బడి నాడు నేడు కింద ప్రభుత్వ స్కూల్స్ ను అభివృద్ది చేస్తున్నామని గవర్నర్ గుర్తు చేశారు. అమ్మఒడి పథకం కింద 44.5 లక్షల మంది తల్లులకు రూ. 13023 కోట్లు ఖర్చు చేశామని గవర్నర్ గుర్తు చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినట్టుగా గవర్నర్ వివరించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని గవర్నర్ తెలిపారు. 2021-22 లో రూ. 9091 కోట్లతో రైతులకు ప్రయోజనం చేకూర్చామన్నారు రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13,500 చొప్పున ఆర్ధిక సహాయం అందించామన్నారు. ఇప్పటివరకు 52.38 లక్షల మంది రైతులకు రూ., 20,162 కోట్ల సహాయం అందించామని గవర్నర్ తెలిపారు.
వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద రూ. 81,703 మంది లబ్దిదారులకు రూ.,577 కోట్ల సహాయం అందించామని గవర్నర్ తెలిపారు.జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయి బ్రహ్మణులకు రూ., 583 కోట్ల సహాయం అందించిన విషయాన్ని గవర్నర్ వివరించారు.స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 12758 కోట్లు అందించామన్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ., 2354 కోట్లు అందించిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 నుండి 60 ఏళ్ల మహిళలకు 9100 కోట్లు అందించామని గవర్నర్ తెలిపారు. ఇక, గవర్నర్ ప్రసంగంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు.. ప్రసంగం మధ్యలోనే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.