
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. లారీ- టెంపో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు.. తిరుపతిలోని చంద్రగిరికి చెందిన 12 మంది నాయుడుపేట సమీపంలోని కనువూరమ్మ ఆలయాన్ని దర్శించుకుని టెంపోలో తిరిగి తిరుపతి బయలుదేరారు. అయితే టెంపో వాహనం శ్రీకాళహస్తి అర్ధనారీశ్వరస్వామి ఆలయం సమీపంలో రాగానే ఎదురుగా వచ్చిన లారీతో ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
ఈ ప్రమాదంలో గాయపడినవారిని స్థానికులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ శివారులో వేగంగా దూసుకొచ్చిన కారు.. హార్వెస్టర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.