మూడు రాజధానులపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం..!

By Sumanth KanukulaFirst Published Sep 17, 2022, 12:30 PM IST
Highlights

మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానులపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది.

మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానులపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో సవాలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్.. అమరావతే రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. 

సీఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలనడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. అభివృద్ది వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టుగా వివరించింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెల్లలో అమరావతిని అభివవృద్ది చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్యం కాదని తెలిపింది. ఇక, గురువారం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వికేంద్రీకరణపై  చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. మూడు ప్రాంతాల అభివృద్దే తమ ధ్యేయం అని మరోసారి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

ఇక, రాజధాని స్థానాన్ని మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఈ ఏడాది మార్చిలో ఏపీ హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని తెలిపింది. అలాగే అమరావతిలో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత అసెంబ్లీ.. ఏపీసీఆర్‌డీఏ రద్దు చట్టం- 2020, ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం- 2020 లను రద్దు చేసింది. 

అయితే జగన్ సర్కార్ మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెబుతుంది.  విశాఖపట్నం (పరిపాలన రాజధాని), అమరావతి (శాసన రాజధాని), కర్నూలు (న్యాయ రాజధాని)..  మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్, మంత్రులు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. 

 

click me!