హనుమ విహారి వ్యవహారంలో అసలు జరిగిందిదీ..: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వివరణ

Published : Feb 28, 2024, 07:19 AM ISTUpdated : Feb 28, 2024, 07:24 AM IST
హనుమ విహారి వ్యవహారంలో అసలు జరిగిందిదీ..: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వివరణ

సారాంశం

హనుమ విహారి చేసిన ఆరోపణలు దుమారం రేపుతుండటంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రియాక్ట్ అయ్యింది. రాజకీయ పార్టీలు, నాయకులు తమ రాజకీయాల కోసం ఈ వ్యవహారాన్ని వాడుకుంటున్నారని అసోసియేషన్ ఆరోపించింది. 

అమరావతి : తెలుగు క్రికెటర్ హనుమ విహారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై తీవ్ర ఆరోపణలు చేసిన  విషయం తెలిసిందే. ఓ వైసిపి కార్పోరేటర్ వల్లే తాను ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీకి దూరమైనట్లు విహారి చేసిన వ్యాఖ్యలు క్రీడాపరంగానే కాదు రాజకీయంగానూ దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై టీమిండియా క్రికెటర్లతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి రాజకీయ ప్రముఖులు కూడా రియాక్ట్ అయ్యారు. ఇలా హనుమ విహారి పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది. 

గత నెల జనవరిలో హనుమ విహారి కెప్టెన్సీలో ఆంధ్ర జట్టు బెంగాల్ తో తలపడిందని అసోసియేషన్ తెలిపింది. ఈ మ్యాచ్ సమయంలోనే తోటి ఆటగాడు పృథ్విరాజ్ ను విహారి వ్యక్తిగతంగా దూషించినట్లు తమకు ఫిర్యాదు అందిందన్నారు. అందరిముందే కెప్టెన్ విహారి తనతో అవమానకరంగా వ్యవహరించినట్లు సదరు ఆటగాడు అధికారికంగా ఫిర్యాదు చేసాడన్నారు. 

ఇక గతంలోనూ హనుమ విహారిపై ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా తోటి ఆటగాళ్లపై విహారి అసభ్య పదజాలం వాడాడని,  అనుచితంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. అతడి వల్ల జట్టులో విబేధాలు చోటుచేసుకుంటున్నాయని జట్టు మేనేజర్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఇలా విహారి వ్యవహారశైలి ముందునుండే బాగాలేదని ఏపీ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. 

Also Read  అతడొక తాగుబోతు , తిరుగుబోతు : హనుమ విహారిపై వైసీపీ కార్పోరేటర్ సంచలన వ్యాఖ్యలు

ఇలా విహారి తీరుపై ఫిర్యాదులు రావడంతోనే చర్యలు తీసుకున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. సెలక్షన్ కమిటీ విహారిని తొలగించి కొత్త కెప్టెన్ గా రిక్కీ భుయ్ ప్రతిపాదించిందని... అందుకు అసోసియేషన్ ఆమోదం తెలిపిందన్నారు. సెలక్షన్ కమిటీ నిర్ణయానికి కట్టుబడి వుంటానని విహారి కూడా తమకు మెయిల్ ద్వారా తెలిపాడన్నారు. కానీ ఇప్పుడు మరోలా ఆరోపణలు చేస్తున్నాడని... అతడి కెప్టెన్సీ తొలగింపులో రాజకీయ కారణాలేమీ లేవన్నారు.  విహారి ఆరోపిస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ పై ఎవరి ఒత్తిడి లేదని... కెప్టెన్సీ తొలగింపు నిర్ణయం పూర్తిగా సెలక్షన్ కమిటీదే అని వెల్లడించారు. 

ఇక విహారి ఆరోపణలు చేసిన రంజీ ప్లేయర్ కె.ఎన్. పృథ్వి రాజ్ మంచి టాలెంటెడ్ ఆటగాడిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. అతడు అండర్ 14, 16 ఏజ్ గ్రూప్, అండర్ 19, విను మన్కడ్, కూచ్ బిహార్, అండర్ 23, 25 కల్నల్ సి. కె. నాయుడు ట్రోఫీలో ఆడి చక్కటి ప్రతిభను చూపారని తెలిపారు. అతడు ప్రతిభావంతుడు కావడంతోనే రంజీ ట్రోపీకి ఎంపికయ్యాడని తెలిపారు. కానీ అతడు ఈ ట్రోపీలో ఒక్కమ్యాచ్ కూడా ఆడలేకపోవడానికి కెప్టెన్ విహారీయే కారణమని తెలిపారు. బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో పృథ్విరాజ్ ను కాదని గాయపడిన మరో వికెట్ కీపర్ ను విహారి ఆడించాడని క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. 

వాస్తవాలు ఇలా ఉంటే విహారి మాత్రం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. దీన్ని నమ్మి కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు క్రికెట్ అసోసియేషన్ పై విమర్శలు చేయడం విచారకమని అన్నారు. క్రికెట్‌ తో రాజకీయాలు చేయడం తగవని సదరు పార్టీలు, నాయకులకు  సవినయంగా విజ్ఞప్తిచేస్తున్నామని ఏసీఏ పేర్కొంది. 

ఇక కెప్టెన్‌గా తననే కొనసాగించాలంటూ జట్టులోని ఆటగాళ్ళంతా కోరినా తొలగించారంటూ హనుమ విహారి చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈ విషయంలో సంబంధిత ఆటగాళ్లు విహారిపై ఆంధ్ర క్రికెట్‌ ఆసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. తమను బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని కొందరు ప్లేయర్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారని తెలిపారు.ఇలా విహారిపై వచ్చిన ఫిర్యాదులన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu