మూడుసార్లు ఫిర్యాదు...అయినా పోలీసులు పట్టించుకోలేదు: చంద్రబాబుతో స్నేహలత తల్లి

By Arun Kumar PFirst Published Dec 24, 2020, 2:24 PM IST
Highlights

దారుణ హత్యకు గురయిన స్నేహలత తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఓదార్చిన చంద్రబాబు నిందితులకు కఠిన శిక్ష పడేదాకా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

అమరావతి: అనంతపురం జిల్లాలో ఎస్‌బిఐ ఉద్యోగి స్నేహలత దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలా కూతురుని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న బాధిత తల్లిదండ్రులను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. స్నేహలత తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఓదార్చిన చంద్రబాబు నిందితులకు కఠిన శిక్ష పడేదాకా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

''ఏం జరిగింది..? ఎలా జరిగిందన్న వివరాలను స్నేహలత తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. నిందితులకు కఠినశిక్ష పడేదాకా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే తన కుమార్తె ప్రాణాలతో ఉండేదని స్నేహలత తల్లి తన ఆవేదనను తెలిపింది. రెండు, మూడు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్నేహలత తల్లి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు వైసిపి ప్రభుత్వం విరుచుకుపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్ సర్కార్ దారుణంగా విఫలమైందని మండిపడ్డారు.  స్నేహలతపై జరిగిన అమానుషాన్ని వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ తరపున కూడా తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధఃపాతాళానికి దిగజారాయని చంద్రబాబు మండిపడ్డారు.  బాధిత కుటుంబానికి తెదేపా అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు.

మరోవైపు స్నేహలత హత్య కేసులో  పోలీసులు ఇద్దిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు గుత్తి రాజేష్, అతని స్నేహితుడు సాకే కార్తీక్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు వీరు వినియోగించిన అపాచీ బైకు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

ధర్మవరం మండలం బడన్నపల్లి పొలాల్లో స్నేహలత హత్యకు గురైన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ కన్ఫర్మ్ చేశారు. అనంతపురంలోని అశోక్ నగర్ కు చెందిన గుత్తి రాజేష్ (23), ఇతని స్నేహితుడు సాకే కార్తీక్ (28) అరెస్టు చేసి ఈరోజు కోర్టు ముందు హాజరు పరచనున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో గుత్తి రాజేష్ ప్రధాన నిందితుడన్నారు. 

ఇతని స్నేహితుడైన సాకే కార్తీక్ ప్రోద్భలం కూడా ఇందులో ఉందన్నారు. గుత్తి రాజేష్ ను సాకే కార్తీక్ ప్రేరేపించాడన్నారు. ధర్మవరం నుండి స్నేహలతను నేర స్థలం వరకు ఎక్కించుకొచ్చిన అపాచీ వాహనాన్ని, ప్రధాన నిందితుడు వినియోగించిన 3 సెల్ ఫోన్లతో పాటు మరో ఫోన్ కలిపి 4 సెల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు

 ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయినా ఈ హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. నిందితులు దొరికారు కాబట్టి వారిని విచారించి హత్యకు గల కారణాలను రాబడతామని పోలీసులు చెబుతున్నారు.


 

click me!