నెల్లూరు జిల్లా కృష్ణపట్టణానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన మందుపై జాతీయ ఆయుర్వేద సంస్థ రెండో రోజూ పరిశోధన చేస్తోంది.
నెల్లూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్టణానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన మందుపై జాతీయ ఆయుర్వేద సంస్థ రెండో రోజూ పరిశోధన చేస్తోంది. కృష్ణపట్టణానికి చెందిన ఆనందయ్య ఇప్పటికే సుమారు 60 వేలకు పైగా మందికి తాను తయారు చేసిన మందును అందించాడు. ఈ మందును తీసుకొన్న వారి వివరాలు సేకరిస్తున్నారు ఆయుర్వేద పరిశోధన సంస్థ బృందం.ఆనందయ్య మందు తీసుకొన్న 500 మంది సమాచారం తీసుకొని వారి నుండి డేటాను సేకరిస్తున్నారు. ఈ మందు తీసుకోకముందు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది, మందు తీసుకొన్న తర్వాత పరిస్థితి ఎలా ఉందనే విషయమై కూడ ఆరా తీస్తున్నారు.
also read:ఆనందయ్య మందు పంపిణీ: రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు
సోమవారం నాడు 190 మంది నుండి సమాచారాన్ని సేకరించారు. స్థానికంగా ఉన్న ఆశా వర్కర్లు, హెల్త్ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వశాఖల అధికారుల నుండి ఆనందయ్య నుండి మందును తీసుకొన్న వారి వివరాలను సీసీఆర్ఏఎస్ సేకరిస్తోంది. తిరుపతి, విజయవాడ ఆయుర్వేద వైద్యశాలలకు చెందిన వైద్యులు ఈ సమాచారాన్ని సేకరిస్తున్నారు.కనీసం 500 మంది డేటాను విశ్లేషిస్తేనే కచ్చితమైన సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆనందయ్య మందు గురించి ఆయుష్ కమిషనర్ రాములు సీఎం జగన్ కు సోమవారం నాడు వివరించారు. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ విశ్లేషణ తర్వాత క్లినికల్ ట్రయల్స్ కూడ నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీని తర్వాతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మందుపై ఓ నిర్ణయం తీసుకొంటాయన్నారు.