జగన్ సర్కార్ బంపరాఫర్: విద్యార్థులకు ఉచితంగా ల్యా‌ప్‌టాప్‌లు

By narsimha lodeFirst Published Jul 9, 2021, 11:15 AM IST
Highlights


 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హమీలను ఏపీ ప్రభుత్వం  దాదాపు 95 శాతానికిపైగా అమలు చేసింది. మేనిఫెస్టోలో పేర్కొన్న అమ్మఒడి పథకంలో భాగంగా నగదు వద్దనుకొన్న లబ్దిదారులకు ల్యాప్‌టాప్ లు ఇవ్వాలని  జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొనే 9, 10 విద్యార్థులకు ఈ పథకం కింద ల్యాప్‌టాప్ లు ఇవ్వాలని జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి: అమ్మఒడి పథకం కింద నగదుకు బదులుగా ల్యాప్‌‌టాప్‌లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్ లో 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం కింద ల్యాప్‌టాప్ లు ఇవ్వనున్నారు. అయితే నగదు వద్దని ల్యాప్ టాప్‌లు కావాలని లబ్దిదారులు ప్రభుత్వాన్ని ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన పథకాల్లో అమ్మ ఒడి ఒకటి. నవరత్నాల్లో భాగంగా ఈ స్కీమ్‌ను ప్రకటించారు సీఎం జగన్. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని జగన్ ప్రకటించారు. 

 డ్యుయెల్‌ కోర్‌ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్‌ 10 (ఎస్టీఎఫ్‌ మైక్రోసాఫ్ట్‌), ఓపెన్‌ ఆఫీస్‌ (ఎక్సెల్, వర్డ్, పవర్‌ పాయింట్‌)ల కాన్ఫిగరేషన్‌తో ల్యాప్‌టాప్‌లు అందించాలని  ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ లాప్‌టాప్ లకు మూడేళ్ల వారెంటీ ఉంటుంది.  ల్యాప్‌టాప్‌లకు మెయిన్‌టెనెన్స్‌ సమస్యలు ఎదురైతే ఫిర్యాదు ఇచ్చిన వారంలోపు పరిష్కరించేలా సదరు కంపెనీకి షరతు విధిస్తున్నారు. ఏవైనా సమస్యలు వస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.
 

click me!