అమరావతి మహా పాదయాత్రకు అడ్డంకులు...స్వయంగా రంగంలోకి వైసిపి ఎమ్మెల్యే కాకాణి

By Arun Kumar PFirst Published Dec 2, 2021, 9:54 AM IST
Highlights

అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. అయితే ఈ పాదయాత్రకు స్థానిక ఎమ్మెల్యే కాకాణి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపించారు. 

నెల్లూరు: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని... మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు మహా పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. అమరావతి ఉద్యమంలో భాగంగా న్యాయస్థానం టు దేవస్థానం పేరిట అమరావతి నుండి తిరుమలకు పాదయాత్ర సాగుతోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర సర్వేపల్లీ నియోజకవర్గంలోని పొదలకూరుకు చేరుకుంది. 

అయితే అధికార YSRCP నాయకులు పాదయాత్రను అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా అన్నింటినీ భరిస్తూ రైతులు, మహిళలు ముందుకు కదులుతున్నారు. మంగళవారం రాత్రి మరిపూరులోని మరిపూరమ్మ ఆశ్రమంలో రైతులు బస చేయాల్సి వుండగా దాన్ని అడ్డుకున్నారు. దీంతో చేసేదేమి లేక పాదయాత్ర చేస్తున్నవారంతా నెల్లూరు వెళ్లి అక్కడ బసచేసారు. 

ఇక బుధవారం కూడా వైసిపి నాయకులు amaravati maha padayatra కు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసారని TDP నాయకులు ఆరోపించారు. Podalakuru శివారులో మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు చేసుకోగా స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో మరోచోట బోజనాలు వండుకుని తెచ్చి మహిళలు, రైతులు నడిరోడ్డుపైనే భోజనాలు చేసారు. ఇలా అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా వాటిని దాటుకుంటూ పాదయాత్రను కొనసాగిస్తూ రైతులు, టీడీపీ శ్రేణులు, ప్రజాసంఘాలు ముందుకు కదులుతున్నాయి.

read more  అమరావతిని అలా చూడాలన్నదే జగన్ కోరిక... ఇంతకు ఇంతా అనుభవిస్తారు.: సోమిరెడ్డి ధ్వజం

పొదలకూరుకు చేరుకున్న రాజధాని రైతులకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పొదలకూరు పట్టణంలో అమరావతి రైతుల మహా పాదయాత్ర  ఉత్సాహభరితంగా సాగింది. 31వ రోజు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని మరుపూరు, చాటగొట్ల,:పొదలకూరు మీదుగా మర్రిపల్లి వరకు పాదయాత్ర సాగింది. 

అమరావతి రైతుల మహా పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకున్నప్పటి నుండి సోమిరెడ్డి పాదయాత్రలో పాల్గొంటున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు జరిగే అమరావతి రైతుల పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని... దేశానికి స్వాతంత్య్రం కోసం శాంతి పోరాటం ఎలా సాగిందో అదే తరహాలో amaravati కోసం మరో పోరాటం జరుగుతోందని సోమిరెడ్డి పేర్కొన్నారు.

అమరావతి మహా పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మీ నాయుడు, కురుగొండ్ల రామకృష్ణ, నెలవల సుబ్రమణ్యం, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టిడిపి రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి గుటూరు మురళీ కన్నబాబు సీనియర్ నాయకురాలు తాళ్ళపాక అనురాధ, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర పాల్గొన్నారు.

అలాగే తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు కుంకాల దశరథ నాగేంద్ర ప్రసాద్, తెలుగు రైతు అధ్యక్షులు రావూరు రాధాకృష్ణ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, గుమ్మడి రాజా యాదవ్, తలచీరు మస్తాన్ బాబు, గాలి రామకృష్ణా రెడ్డి, సీనియర్ నాయకులు సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ముత్తుకూరు మండల తెలుగు యువత అధ్యక్షులు మునిరెడ్డి, టీడీపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 


 

click me!