అసైన్డ్ భూముల వ్యవహారం... ఎమ్మెల్యే ఆర్కేపై పోలీసులకు ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Jul 5, 2021, 5:00 PM IST
Highlights

వెంటనే రామకృష్ణారెడ్డి పై చర్యలు తీసుకోవాలని అమరావతి దళిత రైతులు పోలీసులను కోరారు. 
 

అమరావతి: రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దళిత రైతులు. వెంటనే రామకృష్ణారెడ్డి పై చర్యలు తీసుకోవాలని రైతులు పోలీసులను కోరారు. 

ఇదిలావుంటే గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డుపై మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు అమరావతి దళిత జేఏసీ నాయకులు. దళిత ద్రోహి డౌన్ డౌన్ అంటూ ఆళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దళితుల పట్ల ఆళ్ల రామకృష్ణ రెడ్డి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి అని దళిత జేఎసి నాయకులు డిమాండ్ చేశారు. దళితుల భూములపై కన్నేసి ఈ విధంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్యాకేజీ ఇవ్వకుండా, రెండు సంవత్సరాలుగా కౌలు ఇవ్వకుండా వేధిస్తున్నారని అన్నారు.దళితులపై ప్రేమ ఉన్నట్టు నాటకాలాడుతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి అని దళిత జేఏసి నాయకులు డిమాండ్ చేశారు. 

ప్రస్తుతం అమరావతి భూముల వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. సీఆర్‌డీఏ మాజీ అధికారి చెరుకూరి శ్రీధర్ ప్రకటనతో ఈ వ్యవహారం రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రోత్సహించారని ఆరోపించారు. అమరావతి వ్యవహారంలో అక్రమాలు జరిగాయనడానికి సాక్షాధారాలు వున్నాయని ఆర్కే చెప్పారు. ఇందుకు సంబంధించి వీడియోను రిలీజ్ చేశారు ఆర్కే.

read more  అసైన్డ్ భూముల వ్యవహారం... పోలా రవికి సీఐడి నోటిసులు... ఎవరీ రవి?

అసైన్డ్ భూముల లిస్ట్‌ను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చారని... రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళితుల అసైన్డ్ భూములను కొన్నారని ఆయన ఆరోపించారు. భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాక ప్యాకేజీ ప్రకటించారని ఆర్కే చెప్పారు. దళితుల భూమిని లాక్కోవడానికి బ్రహ్మానందరెడ్డికి హక్కు ఎక్కడిదని ఆర్కే ప్రశ్నించారు. బ్రహ్మానందరెడ్డిని అరెస్ట్ చేయాలని సీఐడీ అధికారులను కోరుతున్నా అన్నారు.

ప్రభుత్వ రికార్డులను కూడా మార్చేశారని.. 4,500 ఎకరాల భూములను కొట్టేయడానికి స్కెట్ వేశారని ఆర్కే ఆరోపించారు. ఐఏఎస్ అధికారి సాంబశివరావు ఈ అక్రమాలకు సహకరించారని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ కూడా సహకరించారని ఆర్కే ఆరోపించారు. అధికారులు సొంత సామాజిక వర్గానికే అన్యాయం చేశారని అన్నారు.

click me!