Amaravati Farmers padayatra: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు.. తిరుపతిలో సభకకు అనుమతివ్వాలని..

By Sumanth KanukulaFirst Published Dec 13, 2021, 2:09 PM IST
Highlights

అమరావతి రైతులు ఏపీ హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. తిరుపతిలో రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. 

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ఆ ప్రాంత రైతులు మహా పాదయాత్రను (Amaravati Farmers padayatra) చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అమరావతి రైతులు ఏపీ హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. తిరుపతిలో రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం సభను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటుందని పిటిషన్‌లో పేర్కొంది. పోలీసులు అసంబద్ధ కారణాలు  చూపుతున్నారని పిటిషననర్ల తరఫు లాయర్ పేర్కొన్నారు. 

హైకోర్టు ఆదేశాలతో మహా పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి డీజీపీ ఇచ్చారని లాయర్ పేర్కొన్నారు. రైతుల సభకు అనుమతి ఇచ్చే అంశంపై జిల్లా ఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. అలాంటిది సభపై డీఎస్పీ స్థాయి అధికారి నిర్ణయం ఎలా తీసుకుంటారని రిట్ పిటిషన్‌లో న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. 

మహాపాదయాత్ర ముగింపు రోజున తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని అమరావతి రైతులు ప్లాన్ చేశారు. ఈ నెల 17న తిరుపతిలో సభ నిర్వహణకు అనుమతి కోరుతూ వారం రోజుల కిందటే అమరావతి జేఏసీ ప్రతినిధులు చిత్తూరు ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. అయితే ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు అనుమతిని నిరాకరించడంతో అమరావతి జేఏసీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కోర్టు అనుమతి, ఆదేశాల మేరకు శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తున్నామని, అదే తరహాలో తాము బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలోనే సభకు అనుమతించేలా చూడాలని వారు హైకోర్టును ఆశ్రయించారు. 

ఇక, అమరావతి రైతుల మహా పాదయాత్ర చివరి దశకు చేరింది. నేడు రేణిగుంట చేరుకున్న అమరావతి రైతులకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. నేడు రైతులతో పాటు ఎంపీ గల్లా జయదేవ్ పాదయాత్రలో పాల్గొన్నారు. రైతులకు తన సంఘీభావం తెలియజేశారు. 


అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా 2019 నుంచి ఇప్పటి వరకు ఉద్యమ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్ర చేపట్టానలి అమరావతి రైతులు నిర్ణయించారు. అయితే ఇందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. రైతుల తరఫు వాదనలతో ఏకీ భవించిన కోర్టు.. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. దీంతో రైతులు గత నెల 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు. 45 రోజుల పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఈ పాదయాత్ర సాగుతుంది. తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగనుంది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు సాగేలా షెడ్యూల్ ఖరారు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా సాగనుంది. రైతుల పాదయాత్రకు టీడీపీ, కాంగ్రెస్.. పార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకన్నప్పటికీ.. సమగ్రమైన బిల్లును తీసుకొస్తామని తెలిపింది. దీంతో అమరావతి రైతులు వారి పోరాటాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలని వారు కోరుతున్నారు. 

click me!