అమరావతికి మద్దతుగా మహాపాదయాత్ర: సీపీఐ, టీడీపీ సంఘీభావం

By narsimha lodeFirst Published Dec 13, 2020, 11:43 AM IST
Highlights

రాజధాని అమరావతి పరిరక్షణ కోసం మహా పాదయాత్రను రైతులు చేపట్టారు. ఆదివారం నాడు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రలో  రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
 

అమరావతి: రాజధాని అమరావతి పరిరక్షణ కోసం మహా పాదయాత్రను రైతులు చేపట్టారు. ఆదివారం నాడు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రలో  రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా  నినాదాలు చేశారు.  రైతులు, మహిళలు చేపట్టిన ఈ యాత్రకు తెదేపా, వాపపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. గుంటూరు నగరంలోని వివిధ వర్గాల ప్రజలతో పాటు రాజధాని రైతులు, మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

 విద్యానగర్ సమీపంలోని శుభం కళ్యాణ మండపం నుంచి గుజ్జనగుండ్ల, హనుమయ్య కంపెనీ, బృందావన్ గార్డెన్స్, ఎన్టీఆర్ స్టేడియం, లక్ష్మిపురం మీదుగా సాగిన పాదయాత్ర లాడ్జ్ సెంటర్​లోని అంబేడ్కర్ విగ్రహం వరకు పాదయాత్ర సాగింది.

అంబేద్కర్ విగ్రహం  వద్ద మానవహారంగా ఏర్పడి పాదయాత్రను ముగించారు. ఈ సందర్భంగా  సీఎం తీరుపై అమరావతి జేఏసీ నేతలు మండిపడ్డారు. 
ఏడాదిన్నర కాలంలో ప్రజలకు కనీసం ఇసుక ఇవ్వలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఎలా కడతారని ఐకాస నేత గద్దె తిరుపతిరావు ప్రశ్నించారు. 
కరోనా కారణంగా ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్నామని ఇకపై అమరావతి ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోందని ఆయన హెచ్ఛరించారు.

అమరావతిలోనే రాజధాని ఉండాలి సీపీఐ నారాయణ

 అమరావతిలోనే రాజధాని ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు కేంద్రం భరించాలన్నాని ఆయన కోరారు. రాష్ట్ర విభజన సమయంలో పెద్ద మనిషిగా ఉన్న వెంకయ్యనాయుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి హోదాలో చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి ఏపీకి, అమరావతికి న్యాయం చేయాలన్నారు.

 మహిళల ఏడుపు దేశానికి మంచిది కాదని... ఆడవారిని ఏడిపించిన రావణాసురుడు, ధుర్యోదనుడు నాశనమైనట్లు  వైసీపీ సర్కారు పతనం అవుతుందని ఆయన హెచ్చరించారు.

రాజధాని అంశం కేంద్రం పరిధిలోనే ఉందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. అమరావతి నుంచి రాజధాని మార్చాలంటే పార్లమెంటులో చర్చించటం తప్పనిసరన్నారు.  ఇవాళ గుంటూరులో ఉద్యమించినట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయేతర ఐకాస నేత శైలజ అన్నారు.

 గుంటూరులో పాదయాత్ర నిర్వహించినట్లుగానే విజయవాడలోనూ భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ఐకాస నేతలు తెలిపారు.  రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ అమరావతికి మద్దతుగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.  ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.


 

click me!