పర్చూరుకు ఆమంచి , కరణానికి లైన్ క్లియర్... చీరాల వైసీపీని సెట్ చేసిన జగన్

By Siva KodatiFirst Published Jan 3, 2023, 9:15 PM IST
Highlights

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చీరాల వైసీపీలో ఆధిపత్యపోరుకు చెక్ పెట్టారు ఏపీ సీఎం వైఎస్ జగన్. దీనిలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. 

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలో వున్న అసంతృప్తులకు చెక్ పెట్టే పనిలో బిజీగా వున్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ . దీనిలో భాగంగా గత కొద్దిరోజులుగా సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి షాకిచ్చారు. దీనిలో భాగంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించారు.

అలాగే బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, ఆమంచి వర్గాల మధ్య కూడా గత కొన్నిరోజులుగా జరుగుతున్న పంచాయతీకి చెక్ పెట్టారు జగన్. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. తద్వారా చీరాల ఇద్దరు నేతల మధ్య వున్న పంచాయతీకి చెక్ పెట్టడంతో పాటు వరుసగా రెండు సార్లు ఓడిపోయిన పర్చూరులో గెలవాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో చీరాలను వదిలి వెళ్లడానికి ఆమంచి అంగీకరించలేదు. అయితే జగన్ నచ్చజెప్పడంతో ఆమంచి మనసు మార్చుకున్నారు.  

ALso REad: ‘‘నాపై కేసు కొట్టివేయండి..’’: ఏపీ హైకోర్టులో ఆమంచి క్వాష్ పిటిషన్

కాగా.. అప్పటి ప్రకాశం జిల్లా చీరాల , పర్చూరు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున కరణం బలరాం, ఏలూరి సాంబశివరావులు గెలిచారు. అయితే తర్వాతి కాలంలో కరణం వైసీపీకి జైకొట్టారు. ఆయన కుమారు వెంకటేశ్ వైసీపీలో చేరగా.. చీరాల ఇన్‌ఛార్జ్ పదవిని కట్టబెట్టారు జగన్. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి కరణం వెంకటేశ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అటు ఆమంచిని పర్చూరుకు వెళ్లాల్సిందిగా జగన్ తెలిపారు..అక్కడ బలంగా వున్న టీడీపీ నేత ఏలూరి సాంబశివరావును ఎదుర్కోవాలంటే కృష్ణమోహన్ అయితేనే కరెక్ట్ అని సీఎం భావిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం, ఇంకొల్లు, పర్చూరు, మార్టూరులలో ఆమంచికి భారీ అనుచరగణం వుంది. అలా చీరాల వైసీపీలో ఆధిపత్య పోరుకు జగన్ చెక్ పెట్టినట్లయ్యింది. 


 

click me!