"కేబినేట్లో లోకేష్ ఉండొచ్చు...కానీ ముస్లింలు వద్దా "...

By rajesh yFirst Published Aug 31, 2018, 3:59 PM IST
Highlights

 నారా హమారా.. టీడీపీ హమారా సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన అమాయక ముస్లిం యువకులపై అక్రమ అరెస్టులకు పాల్పడడం అమానుషం అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గుంటూరు: నారా హమారా.. టీడీపీ హమారా సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన అమాయక ముస్లిం యువకులపై అక్రమ అరెస్టులకు పాల్పడడం అమానుషం అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ముస్లిం యువకుల అక్రమ అరెస్టులకు నిరసనగా గుంటూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మద్దతు పలికిన అంబటి రాంబాబు ముస్లిం సోదరులు అధైర్యపడొద్దని, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ముస్లిం యువకుల అక్రమ అరెస్టులతో ముస్లింల ఓట్లు అడిగే పూర్తి హక్కు సీఎం చంద్రబాబుకు పోయిందని, టీడీపీ హయాంలో ముస్లింలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. ముస్లిం యువకులు తమ సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిందిపోయి అరెస్టులతో అణగదొక్కడం సిగ్గుచేటన్నారు. 

టీడీపీ పతనంతోనే ముస్లింలకు మేలు జరుగుతుందన్న అంబటి గతంలో ఎప్పుడైనా ముస్లింలు లేని కేబినెట్‌ చూశామా అంటూ ప్రశ్నించారు. ముస్లింలను కేబినెట్‌లోకి తీసుకోరు కానీ, లోకేష్‌ను మాత్రం తీసుకుంటారని దుయ్యబట్టారు. ముస్లింల అభివృద్ది గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు.

శాంతియుతంగా ఫ్లకార్డులతో నిరసన తెలిపిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని ముస్లిం యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం బెయిల్ పై విడుదలయ్యారు. 2014లో ముస్లింలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ప్రశ్నించినందుకు అరెస్టు చేశారని మండిపడ్డారు. పోలీసులు తమను ఈడ్చుకుంటూ నల్లమడుగు తీసుకెళ్లి బట్టలూడదీసికొట్టారని కన్నీటిపర్యంతమయ్యారు. ముస్లింలపై చంద్రబాబుకున్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు. 

మరోవైపు నాలుగేళ్లుగా ముస్లింలకు చంద్రబాబు చేసిందేమీ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ నేత హబీబుల్లా విమర్శించారు. ముస్లింలను టీడీపీ ప్రభుత్వం అన్నివిధాలుగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిలో ముస్లింలు పాలుపంచుకుంటారన్నారు. ముస్లిం యువకులపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 
 

click me!