ఆ మాజీ ఎంపీలు ఏపార్టీలో ఉన్నట్లో......

By rajesh yFirst Published 31, Aug 2018, 3:36 PM IST
Highlights

ఎన్నికల సమయం సమీపిస్తోంది. రాజకీయంగా చైతన్యవంతమైన తూర్పుగోదావరి జిల్లాలో అప్పుడు ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఊహాగానాలు, విశ్లేషణలు, రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే జిల్లా రాజకీయాల్లో కీలకమైన ఇద్దరు మాజీ ఎంపీలు హాట్ టాపిక్ గా మారారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదేళ్లపాటు ఓ వెలుగు వెలిగిన ఆ నేతలు 2014 నుంచి తటస్థంగా ఉండిపోయారు. 

కాకినాడ: ఎన్నికల సమయం సమీపిస్తోంది. రాజకీయంగా చైతన్యవంతమైన తూర్పుగోదావరి జిల్లాలో అప్పుడు ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఊహాగానాలు, విశ్లేషణలు, రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే జిల్లా రాజకీయాల్లో కీలకమైన ఇద్దరు మాజీ ఎంపీలు హాట్ టాపిక్ గా మారారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదేళ్లపాటు ఓ వెలుగు వెలిగిన ఆ నేతలు 2014 నుంచి తటస్థంగా ఉండిపోయారు. 

అప్పుడప్పడు ప్రెస్మీట్లతో తమ ఉనికిని చాటుకుంటున్నా ఏపార్టీలోకి వెళ్తారో అసలు పోటీ చేస్తారా చెయ్యరా అన్నదానిపై మాత్రం లీకులివ్వడం లేదు. ఒకసారి సీఎంను కలుస్తారు మరోసారి జగన్ పొగుడుతారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సైతం కలుస్తారు. సూచనలు ఇస్తారు. ఇలా అన్ని పార్టీలను చుట్టేస్తున్నా ఆ ఎంపీలు ఏపార్టీలోకి వెళ్తారు. 2019 ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

ఉండవల్లి అరుణ్ కుమార్, జీవీ హర్షకుమార్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తులు. ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమహేంద్రవరం లోక్‌సభ నుంచి, అమలాపురం లోక్ సభ నుంచి జీవీ హర్షకుమార్ లు 2004, 2009 ఎన్నికలలో గెలిచారు. పదేళ్లపాటు రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి దూరమైన ఇద్దరు నేతలు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో కలసి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టించారు. రాజమహేంద్రవరంలో జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావ సభను కూడా కలిసి నిర్వహించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయనని అప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించగా, హర్షకుమార్ మాత్రం జై సమైక్యాంధ్ర పార్టీ తరపున అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు.  

2014 ఎన్నికల తర్వాత అరుణ్‌కుమార్‌, హర్షకుమార్‌ లు వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన అరుణ్‌కుమార్‌ ఆయన తనయుడు జగన్‌ పార్టీలో చేరి రాజకీయ సలహాదారుగా ఉంటారని కూడా ఊహాగానాలు వినిపించాయి. కొన్ని సందర్భాలలో వైఎస్ జగన్ ను సమర్ధిస్తూ రావడంతో ఆయన అనుచరులు సైతం ఉండవల్లి వైసీపీలో చేరతారని నమ్మేవారు. 
 
అటు హర్ష కుమార్‌ కూడా వైసీపీలో చేరతారంటూ జోరుగా ఊహాగానాలు వచ్చాయి. పలు సందర్భాలలో వైఎస్ జగన్‌ని హర్షకుమార్ కలిశారు కూడా. అయితే అమలాపురం పార్లమెంట్ సీటు ఇవ్వాలని కోరగా..అందుకు ససేమిరా అనడంతో వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరిగింది. అమలాపురం లోక్ సభకు మాజీమంత్రి పినిపే విశ్వరూప్ వైసీపీ తరపున పోటీ చేయనున్నారు. హర్షకుమార్, విశ్వరూప్ లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఈ నేపథ్యంలో హర్షకుమార్ రాకను పినిపే విశ్వరూప్ వ్యతిరేకించినట్లు కూడా చర్చజరిగింది. 

మరోవైపు మాజీఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఇటీవల అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడును కలిశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం సమర్ధవంతంగా పనిచేస్తున్నారంటూ కితాబు సైతం ఇచ్చారు. దీంతో అరుణ్ కుమార్ సైకిలెక్కనున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సైతం ఉండవల్లి కలిశారు. రాజకీయ సూచనలు సలహాలు సైతం ఇచ్చారు. పవన్ కు రాజకీయ సలహాదారుగా ఉండవల్లి అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ పార్టీలో చేరతారనేది మాత్రం ఇంకా ఓ క్లారిటీ రావడం లేదు.  

అటు మాజీఎంపీ హర్షకుమార్‌ సైతం తన రాజకీయ పున:ప్రవేశంపై సందిగ్ధంలో ఉన్నారట. వైసీపీ కండువా కప్పుకోవాలా లేదా జనసేనకు జై కొట్టాలా అన్నదానిపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ తో విభేధించే హర్షకుమార్ ఆయన తనయుడు జగన్ తో కలవరని...కలిసినా జగన్ తన రాజకీయ ఎదుగుదలకు సహకరిస్తారా అన్న అనుమానంతో ఉన్నారట. 

వైసీపీలోకి వచ్చినా అమలాపురం లోక్ సభ టికెట్ ఇవ్వరని తేలడంతో అటువైపు ప్రయత్నాలు విరమించుకున్నారట. అయితే జనసేనకు బలమైన నాయకుడు లేకపోవడంతో అటువైపు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి ఆహ్వానం రాకపోవడంతో హర్షకుమార్ మిన్నకుండిపోయారు. పోనీ టీడీపీలోకి వెళ్దామంటే వెళ్లలేని పరిస్థితి. మెుదటి నుంచి టీడీపీకి బద్ద వ్యతిరేకిగా ఉన్న హర్షకుమార్ ఏపార్టీలోకి వెళ్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.  

ఇకపోతే కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి పళ్లంరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు. అయితే గతకొంతకాలంగా చలమలశెట్టి సునీల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

కనీసం కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో సైతం ప్రత్యక్షం కాలేదు. దీంతో సునీల్ వైసీపీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. అయితే సునీల్ టీడీపీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలే జనసేన పార్టీ నుంచి పిలుపురావడంతో ఆలోచనలో పడ్డారు. అయితే సునీలో సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త చలమలశెట్టి గోపి మాత్రం టీడీపీలో చేరాలని సునీల్ కు సూచిస్తున్నారు. 

దీంతో సునీల్ ఏ పార్టీలోకి వెళ్తారు అనేది తెలియని పరిస్థితి. అన్న చెప్పినట్లు టీడీపీలోకి చేరతారా జనసేన ఆహ్వానం మేరకు జనసేనలోకి జంప్ అవుతారా.లేదా వైసీపీలోనే ఉండిపోతారా అన్నది తెలియాలంటే మరో నెలరోజులపాటు వేచి చూడాల్సిందే. ఎందుకంటే సెప్టెంబర్ నెలలో తన రాజకీయ భవిష్యత్ పై ఓ ప్రకటన చేస్తానని తన అనుచరుల దగ్గర సునీల్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

Last Updated 9, Sep 2018, 11:23 AM IST