
ఏపీలో ఇంటర్మీడియన్ విద్యార్థుల పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. అమ్మాయిలు ఈ పరీక్షల్లో సత్తా చాటారు. అయితే..ఒకచోట మాత్రం పరీక్ష రాసిన విద్యార్థులందరూ ఫెయిల్ అయ్యారు. ఈ సంఘటన అనకాపల్లిలో చోటుచేసుకుంది.అది కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సీఈసీ గ్రూపు నుంచి 16 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారు. శుక్రవారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఒక్కరూ కూడా ఉత్తీర్ణత కాలేదని భోగట్టా. 2013వ సంవత్సరంలో అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు అనకాపల్లికి జూనియర్ కళాశాలను మంజూరు చేశారు.
ఇక్కడ కళాశాలకు భవనం లేకపోవడంతో పట్టణ బాలికల హైస్కూల్‌లో ఇప్పటివరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకే గదిలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాల నూతన భవనానికి సుమారు రెండున్నర కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు భవన నిర్మాణం పూర్తి కాలేదు.
కళాశాలకు శాశ్వతమైన ప్రిన్సిపాల్ కాని, అధ్యాపకులు గాని నియామకం జరగలేదు. కాంట్రాక్టు లెక్చరర్‌లతో కళాశాలను నడిపిస్తున్నారు.. ఏడాదికి పది నుంచి 20 మందికి మించి కళాశాలలో విద్యార్థులు చేరడం లేదు. అసలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అలాగే కళాశాలలో సీఈసీ గ్రూపు మాత్రమే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ వంటి గ్రూపులు లేకపోవడం వలన విద్యార్థులు ఎవరూ ఈ కళాశాలలో చేరడానికి ముందుకు రాకపోవడం గమనార్హం.