
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. అల్లుడితో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో తన అల్లుడితో కలిసి మహిళ భర్తను చంపేసింది. సీఐ మదుసూదన్ రెడ్డి, ఎస్సై లక్ష్మీకాంత్ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జిల్లాలోని ఐరాల మండలం రంగయ్యచెరువులోని ఎస్టీ కాలనీకి చెందిన నాగరాజు (51) అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం మంజులతో వివాహమైంది. వారికి కూతురు ఉంది. కూతురు రాణిని బంగారుపాళ్యం మండలం చిట్టేరి ఎస్టీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే, మంజుల గత మూడేళ్లుగా సుబ్రహ్మణ్యంతో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది.
సోమల మండలం ఇర్లపల్లెలో ఉంటున్న కూతురు రాణి ఇంటికి వారం రోజుల క్రితం మంజుల వచ్చింది. ఆమె కోసం భర్త నాగరాజు కూడా ఇక్కడికి వచ్చాడు. దాంతో భర్తను చంపేందుకు మంజుల, ఆమె అల్లుడు సుబ్రహ్మణ్యం పథకం వేశారు. ఇద్దరు కలిసి నాగరాజును కంచెంవారిపల్లె సమీపంలోని అడవికి తీసుకుని వెళ్లి విపరీతంగా మద్యం తాగించారు.
ఆ తర్వాత నాగరాజును కర్రలతో, రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని వడ్లవాణి కుంటలో పడేసి వెళ్లిపోయారు. నీటిపై తేలుతున్న శవానని పోలీసులు స్వాధీనం చేసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శవాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు దర్యాప్తు అనంతరం మంజులను, సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.