సొంత కొడుకునే కిడ్నాప్ చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు: భార్యకు బెదిరింపులు

By telugu teamFirst Published Aug 1, 2021, 9:45 AM IST
Highlights

జల్సాలకు అలవాటు పడి లక్షల మేరకు అప్పులు చేసిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు తన సొంత కుమారుడినే కిడ్నాప్ చేసి భార్యను బెదిరించాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలోని కందూకురు పీఎస్ పరిధిలో జరిగింది.

ఒంగోలు: ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు డబ్బుల కోసం అత్యంత దారుణమైన సంఘటనకు ఒడిగట్టాడు. జల్సాలకు అలవాటు పడిన ఓ టెక్కీ సొంత కుమారుడినే కిడ్నాప్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే కుమారుడిని చంపేస్తానని భార్యను బెదిరించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. 

కందుకూరు పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కండే శ్రీనివాసులు, సీఐ వి. శ్రీరామ్ శనివారంనాడు ఆ సంఘటనకు సంబందించిన వివరాలను అందజేశారు. పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన పల్నాటి రామకృష్ణా రెడ్డి అదే గ్రామానికి చెందిన ఉమ అనే యువతిని ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. రామకృష్ణారెడ్డి హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. 

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో రామకృష్ణా రెడ్డి ఏడాదిగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు. జూదం, మద్యం వంటి దుర్వ్యసనాలకు బానిసైన రామకృష్ణా రెడ్డి 20 లక్షల రూపాయల దాకా అప్పులు చేశాడు. డబ్బుల కోసం రుణదాతలు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో డబ్బుల కోసం కుటుంబ సభ్యులను అడిగాడు. వారు అందుకు అంగీకరించలేదు. దాంతో జులై 28వ తేదీన తన సొంత కొడుకుని కిడ్పాప్ చేశాడు. 

కుమారుడిని కందుకూరులోని ఓ లాడ్జికి తీసుకుని వెళ్లాడు. ఆ రోజు రాత్రి మద్యం సేవించి భార్యకు ఫోన్ చేశాడు. కుమారుడిని కిడ్నాప్ చేశానని, డబ్బులు ఇవ్వకపోతే అతన్ని  చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేపట్టి రామకృష్ణా రెడ్డి ఆచూకీ కోసం సాంకేతికత సాయం తీసుకున్నారు. అతన్ని కందుకూరు లాడ్జిలో గుర్తించి పట్టుకున్నారు. బాలుడిని విడిపించి తల్లికి అప్పగించారు. 

click me!