
ఆమె నర్సింగ్ కోర్సు మూడో సంవతసరం చదువుతోంది. రెండు సంవత్సరాల నుంచి ఓ యువకుడితో ప్రేమలో ఉంది. అతడు కొంత కాలం కిందట గంజాయికి బానిస అయ్యాడు. తన సోదరులు డబ్బులు ఇవ్వలేదని.. క్షణికావేశంలో అతడు రెండు నెలల కిందట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతడిని మర్చిపోలేక ప్రియురాలు కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన యానాం లో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. యూకేవీనగర్ కు చెందిన 22 ఏళ్ల మీసాల మౌనిక తల్లిదండ్రులు పదేళ్ల కిందట మరణించారు. ఆమెకు ఓ అక్క, చెల్లి ఉండగా.. వారిద్దరికీ వివాహాలు అయ్యాయి. దీంతో మౌనికను అలనా పాలన ఆమె మేనమామ త్రిమూర్తులు చూసుకుంటున్నారు. కాగా.. ఆమె తాళ్లరేవులో ఉన్న ఓ నర్సింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది.
ఇదిలా ఉండగా.. దాదాపు రెండు సంవత్సరాల నుంచి కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నా, మౌనిక ప్రేమించుకుంటున్నారు. అయితే కొంత కాలం కిందట చిన్నా గంజాయికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో తన సోదరుడుని రూ.500 అడిగాడు. అతడు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇక అప్పటి నుంచి ప్రియురాలు మౌనిక కాలేజీకి వెళ్లడం లేదు. అతడిని తలుచుకుంటూనే జీవిస్తోంది. ప్రియుడైన చిన్నా బట్టలను, ఇతర వస్తువులను తన రూమ్ లో ఉంచుకుంది. అతడి ఫొటోలను కూడా గోడలకు వేలాడదీసింది. వాటిని చూసుకుంటూ గడుపుతోంది. ప్రియుడి జ్ఞాపకాలతో జీవిస్తూ.. మానసికంగా కుంగుబాటుకు గురైంది. ఈ క్రమంలోనే సోమవారం ఇంట్లో బలవన్మరణానికి పాల్పడింది. కొంత సమయం తరువాత మేనమామ త్రిముర్తులు గమనించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని డెడ్ బాడీని హాస్పిటల్ తీసుకెళ్లి. పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.