
కర్నూలు : సరదాగా బంధువుల ఇంటికి వెడితే అదే తమ పాలిట శాపంగా మారింది ఆ దంపతులకు. తమ గారాలపట్టి.. కలల పంట మూడేళ్ల కొడుకును కోల్పోయి కోలుకోలేని దు:ఖంలో మునిగిపోయారు. మూడేళ్ల కొడుకు బుడి బుడి అడుగులతో ముసి ముసి నవ్వులతో మురిసిపోతున్న ఆ కుంటుంబంలో ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారిని.. వేడి సాంబారు రూపంలో మృత్యువు కబలించింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన నాగరాజు, రామేశ్వరమ్మలకు ఇద్దరు కుమారులు. మూడు రోజుల కిందట ఎమ్మిగనూరులోని తమ బంధువుల ఇంట్లో జరుగుతున్న పూజా కార్యక్రమానికి వెళ్లారు. పండుగ వాతావరణం ఉన్న ఆ ఇంట్లో వారి మూడేళ్ల కొడుకు సోమనాథ్ (3) ముద్దు మాటలు అందరినీ అలరించాయి.
అంతలోనే తీరని విషాదం వెంటాడింది. సోమవారం ఉదయం ఇంటిల్లిపాదికీ సాంబారు వండారు. దాన్ని ఓ పక్కగా ఉంచారు. అయితే ఆడుకుంటూ అటుగా వెళ్లిన సోమనాథ్.. అదేంటో చూసుకోలేదు. ప్రమాదవశాత్తు సాంబారు గిన్నెలో పడిపోయాడు. అప్పుడే వండి పెట్టిన సాంబార్ కావడంతో చాలా వేడిగా ఉంది. దీంతో ఒళ్లంతా కాలిపోయి.. పెద్దగా ఏడుస్తూ విలవిల్లాడిపోయాడు. అది గమనించిన బంధువులు వెంటనే బాబును సాంబార్ లోంచి తీసి.. కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాబు చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు.
గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారు:కృష్ణ మృతితో బుర్రిపాలెంలో విషాదం
ఇలాంటి ఘటనే 2019లో తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. వేడి వేడి సాంబారులో పడి ఓ మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ దారుణ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు గురుకుల పాఠశాలలో 2019 డిసెంబర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... గద్వాల జిల్లా గట్టు గురుకుల పాఠశాలలోని మానవపాడుకి చెందిన గురుకుల విద్యాలయాన్ని గట్టుకు తరలించారు. అందులో అయిజ మండలం చిన్నతాండ్రపాడకు చెందిన లక్ష్మీ అనే మహిళ కేర్ టేకర్ గా పనిచేస్తోంది.
ఆమెకు మూడేళ్ల కుమార్తె రిష్మిక(3) ఉంది. కూతురు చిన్నది కావడం, ఇంట్లో చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో.. తనతోపాటు తన కుమార్తెను కూడా లక్ష్మీ రోజూ గురుకులానికి తీసుకువస్తూ ఉండేది. కాగా... ఆ రోజు మధ్యాహ్నం లక్ష్మీ విద్యార్థులకు భోజనం వడ్డించే సమయంలో రిజిస్టర్ లో పేర్లు నమోదు చేసే పనిలో బిజీగా ఉంది. పక్కన ఆడుకుంటున్న కుమార్తె సంగతి మరిచిపోయింది. ఈ సమయంలో చిన్నారి రష్మిక ఆడుకుంటూ వెళ్లి వేడి వేడి సాంబారు గిన్నెలో పడింది.
మధ్యాహ్నం భోజనంలో భాగంగా చిన్నారులకు వడ్డించాల్సిన సాంబారు గిన్నె అది. అందులో పడింది రష్మిక. వెంటనే పెద్ద అరుపులు, కేకలు వినిపించడంతో.. తీవ్రగాయాలపాలైన చిన్నారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారి చికిత్స పొందుతూ కన్నుమూసింది. కాగా.. చిన్నారి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.