
దేశంలో మహిళలు, చిన్నారులపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి నేరాలు చోటుచేసకుంటున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే అదే జిల్లాలో ఇలాంటి దారుణం మరోకటి చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు మాయ మాటలు చెప్పి.. జీడితోటకు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. చోడవరం మండలంలో ఓ గ్రామానికి చెందిన గోపి అనే యువకుడు కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. బాధిత బాలిక తల్లిదండ్రులు కూలీ పనులు చేసకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లిన సమయంలో బాలిక ఇంట్లోని పెద్దల వద్ద ఉంటుంది. అయితే కొద్ది రోజుల క్రితం గోపి బాలికకు మాయ మాటలు చెప్పి గ్రామానికి సమీపంలో ఉన్న జీడితోటకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం జరిపాడు. అనంతరం బాలికను ఇంటి వద్ద వదిలేశాడు. అయితే బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.
దీంతో అనకాపల్లి దిశా డీఎస్పీ కృష్ణారావు, ఎస్సై విభీషణరావు, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణంలోని ఆరేళ్ల బాలికపై శుక్రవారం తెల్లవారుజామున ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... నర్సీపట్నంలో నివాసం ఉంటున్న బాలిక అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తన అక్కతో కలిసి బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో ఓ వ్యక్తి బాలికను బలవంతంగా లాక్కెళ్లాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాలిక అక్క వెంటనే అక్కడ నుంచి ఇంటికి పరుగెత్తికెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అంతా కలిసి బాలిక కోసం వెతకడం ప్రారంభించాడు. అయితే వారికి బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో బాలికను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తనను పొరుగింటి వ్యక్తి ఎత్తుకెళ్లాడని తెలిపింది. దీంతో బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏరియా ఆస్పత్రికి వచ్చి బాధిత కుటుంబీకులను జిల్లా కలెక్టర్ రవిసుభాష్, ఎస్పీ గౌతమిశాలి, నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోల్ బాధిత బాలికను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేరం జరిగిన తర్వాత నిందుతుడు అక్కడి నుంచి పారిపోయాడని.. అతడిని తర్వాత తమ బృందాలు అరెస్ట్ చేశాయని ఏఎస్పీ మణికంఠ చెప్పారు.