గుంటూరులో ఘోర ప్రమాదం... ఆర్టిసి బస్సు‌ - లారీ ఢీ, ప్రయాణిలకు తీవ్ర గాయాలు

Arun Kumar P   | Asianet News
Published : Jun 08, 2022, 03:33 PM ISTUpdated : Jun 08, 2022, 03:37 PM IST
గుంటూరులో ఘోర ప్రమాదం... ఆర్టిసి బస్సు‌ - లారీ ఢీ,  ప్రయాణిలకు తీవ్ర గాయాలు

సారాంశం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళుతున్న ఆర్టిసి బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన నిలిపిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు గాయపడ్డారు. 

గుంటూరు: జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళుతున్న ఆర్టిసి బస్సు (APSRTC Bus) అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టిన దుర్ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదలో బస్సు డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఘోరంగా జరిగినా ఎలాంటి ప్రాణనష్టం  జరగలేదు. 

వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాజధాని చెన్నై నుండి కాకినాడ (chennai to kakinada)కు కొందరు ప్రయాణికులతో నిన్నరాత్రి ఓ ఆర్టిసి బస్సు బయలుదేరింది. ఈ బస్సు ఇవాళ తెల్లవారుజామున గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలో ప్రయాణిస్తుండగా ఒక్కసారికి అదుపుతప్పింది.  డ్రైవర్ నిద్రమత్తులో వున్నాడో ఏమో  కొలనుకొండ సాయిబాబా ఆలయం వద్ద రోడ్డుపక్కన నిలిపివుంచిన లారీని గుర్తించలేకపోయాడు. దీంతో జాతీయ రహదారిపై మంచి వేగంలో వున్న బస్సు అదుపుతప్పి అమాంతం లారీపైకి దూసుకెళ్లింది. లారీని వెనకనుండి ఢీ కొట్టడంతో బస్సు ముందుబాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. 

ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే వారిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లు ఈ నలుగురి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపినట్లు సమాచారం. 

ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రోడ్డుపైనుండి బస్సును తొలగించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు.

కృష్ణా జిల్లాలో కూడా ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం అంబాపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళుతున్న ఓ కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు విజయనగరం వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. 

వెంటనే మృతదేహాలను కారు నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాసేపట్లో వేడుక జరిగే ప్రదేశానికి చేరుకుంటారని అనుకుంటుండగా జరిగిన ఈ ప్రమాదంతో మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ
Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu