టిటిడిలో మరణమృదంగం... కోటి రూపాయల నష్టపరిహారం...: టిడిపి కార్యదర్శి డిమాండ్

By Arun Kumar PFirst Published Apr 30, 2021, 2:29 PM IST
Highlights

 కరోనా బారిన పడి ముగ్గురు టిటిడి ఉద్యోగులు మృత్యువాతపడ్డారుని...దీంతో ఇప్పటివరకు కరోనాతో మొత్తం 16మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని టిడిపి నాయకులు రాంప్రసాద్ అన్నారు.

అమరావతి: ప్రతిరోజు లక్షమందికి పైగా భక్తులు విచ్చేసే టిటిడిలో ఉద్యోగులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. తాజాగా కరోనా బారిన పడి ముగ్గురు టిటిడి ఉద్యోగులు మృత్యువాతపడ్డారుని...దీంతో ఇప్పటివరకు కరోనాతో మొత్తం 16మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని రాంప్రసాద్ అన్నారు.

''ప్రభుత్వం నిర్లక్ష వైఖరి కారణంగానే వందలాది మంది ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే తిరుమలలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన అమరావతిలో కూడా ఇప్పటికే 8మంది మృతిచెందారు. ఒకపక్క కరోనా విలయ తాండవం చేస్తుంటే ప్రభుత్వం మొండిగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

read more  టెన్త్,ఇంటర్ పరీక్షలపై పున:పరిశీలించండి: ఏపీ సర్కార్‌కి హైకోర్టు సూచన

''తాజాగా ఒక కళాశాలలో ఏకంగా 163మంది విద్యార్థులకు కరోనా సోకింది. మే 5వతేదీ నుంచి 10లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. విద్యాశాఖ మంత్రి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. పాజిటివ్ విద్యార్థుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటుచేస్తామని ఇదివరలో చెప్పారు, ఇప్పుడు వారికి సప్లిమెంటరీలో అవకాశం కల్పిస్తామని అంటున్నారు, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా?'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''రేపు పరీక్షలు మొదలయ్యాక ఎవరైనా కరోనా బారిన పడి మరణిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తారా? తమ బిడ్డలను అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలి. టిటిడిలో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు కోటిరూపాయల నష్టపరిహారం ప్రకటించాలి. తిరుమలలో ప్రత్యేకించి కోవిద్ చికిత్స విభాగాన్ని ఏర్పాటుచేసి భక్తులు, ఉద్యోగులకు రక్షణ కల్పించాలి'' అని రాంప్రసాద్ డిమాండ్ చేశారు. 

click me!