జెండాలు ఎగరేయండి: మంత్రులకు జగన్ ఆదేశాలు

By Nagaraju penumalaFirst Published Aug 13, 2019, 5:37 PM IST
Highlights

ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ 12 మంది మంత్రులు జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అయితే జగన్ ఎంపిక చేసిన వారిలో అత్యధికంగా జిల్లా ఇంచార్జ్ మంత్రులే జాతీయ జెండా ఎగురవేయగా మూడు చోట్ల మార్పులు చేశారు సీఎం జగన్. 
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పంద్రాగష్టు సందర్భంగా 12 మంది మంత్రులకు చక్కటి హోదా కల్పించారు. మంత్రులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే పంద్రాగష్టున జెండా ఎగురవేసే మంత్రుల జాబితాను జగన్ విడుదల చేశారు. 

25 మంది జగన్ కేబినెట్ లో 12 మందికి జగన్ అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో అశేష జనవాహిని ముందు నిలబడి జెండా వందనం చేసే అవకాశం కల్పించారు. అనంతరం శకటాలను వీక్షిస్తారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే ఛాన్స్ కూడా కొట్టేశారు ఆ పన్నెండు మంది. 

ఇక పంద్రాగష్టున జెండా ఆవిష్కరించే వారి జాబితా చూస్తే రాష్ట్రరాజధాని కృష్ణాజిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇకపోతే శ్రీకాకుళం జిల్లాలో దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జెండా ఆవిష్కరించనున్నారు. 

విజయనగరం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి జెండా ఎగురవేయనుండగా వాణిజ్య రాజధాని విశాఖపట్నంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ జెండాను ఆవిష్కరించనున్నారు. 

ఇకపోతే తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, పశ్చిమగోదావరి జిల్లాలో మరో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ లు జెండా ఎగురవేయనున్నారు. ఇకపోతే గుంటూరు జిల్లాలో మంత్రి పేర్ని నాని, ప్రకాశం జిల్లాలో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు జెండా ఆవిష్కరించనున్నారు. 

నెల్లూరు జిల్లాలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఇకపోతే కర్నూలు జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ, వైయస్ఆర్ కడప జిల్లాలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా జాతీయ జెండా వందనం చేయనున్నారు. 

అటు మరోమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లాలో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తన సొంత జిల్లా అయిన చిత్తూరులో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. 

ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ 12 మంది మంత్రులు జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అయితే జగన్ ఎంపిక చేసిన వారిలో అత్యధికంగా జిల్లా ఇంచార్జ్ మంత్రులే జాతీయ జెండా ఎగురవేయగా మూడు చోట్ల మార్పులు చేశారు సీఎం జగన్. 

విజయనగరం జిల్లా ఇంచార్జ్ మంత్రిగా చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఉండగా ఆయనకు కాకుండా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి అవకాశం కల్పించారు. మరోవైపు చిత్తూరు జిల్లా ఇంచార్జ్ మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి ఉండగా ఆ అవకాశం డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి కల్పించారు. 

ఇకపోతే వైయస్ఆర్ కడప జిల్లా విషయానికి వస్తే జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే జాతీయ జెండా ఎగురవేసే అవకాశం మాత్రం డిప్యూటీ సీఎం అంజద్ బాషాకు కల్పించారు సీఎం జగన్. 

click me!