బోటులో చెన్నై నుండి శ్రీకాకుళానికి 12 మంది మత్స్యకారులు: క్వారంటైన్‌కి తరలింపు

By narsimha lodeFirst Published Apr 19, 2020, 5:14 PM IST
Highlights

చెన్నై నుండి ఓ బోటులో పన్నెండు మంది మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాకు చేరుకొన్నారు. వీరంతా  ఏ ప్రాంతంలో ఒడ్డుకు చేరుకొంటారోననే విషయమై అధికారులు సముద్ర తీర ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు. 

శ్రీకాకుళం:  చెన్నై నుండి ఓ బోటులో పన్నెండు మంది మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాకు చేరుకొన్నారు. వీరంతా  ఏ ప్రాంతంలో ఒడ్డుకు చేరుకొంటారోననే విషయమై అధికారులు సముద్ర తీర ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు. చివరకు కవిటి మండలం ఇద్దివానిపాలెం వద్ద వారు ఒడ్డుకు చేరుకోవడంతో పోలీసులు వారిని క్వారంటైన్ కు తరలించారు.

చెన్నై సమీపంలోని రాయపురం తీరంలో ఈ నెల 14వ తేదీ రాత్రి బోటులో కవిటి మండలానికి చెందిన ఏడుగురు సోంపేట మండటానికి చెందిన ఐదుగురు కవిటి మండలానికి బయలుదేరారు.

బోటులో బయలుదేరే ముందు తమకు సరిపడు ఆహారాన్ని కూడ వారు నిల్వ చేసుకొన్నారు. అటుకులు, బిస్కట్లు, రొట్టెలను తమ వెంట తెచ్చుకొన్నారు. 95 గంటల పాటు వారంతా సముద్ర మార్గంలో ప్రయాణం చేశారు.

అయితే చెన్నై నుండి మత్య్సకారులు వస్తున్న విషయం తమ ప్రాంతానికి చెందిన గ్రామస్తులకు తెలిసింది. అయితే వారిని గ్రామాల్లోకి రానివ్వకూడదని గ్రామస్తులు తీర్మానం చేశారు.

ఈ విషయాన్ని సెల్ ఫోన్ ద్వారా బోటు ద్వారా ప్రయాణం చేస్తున్న మత్స్యకారులు తెలుసుకొన్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా సమీపంలోకి చేరుకొన్న విషయాన్ని గుర్తించిన మత్య్సకారులు తమ సెల్ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకొన్నారు.

సముద్ర మార్గం ద్వారా మత్స్సకారులు వస్తున్న విషయం తెలుసుకొన్న పోలీసులు తీర ప్రాంతంలో నిఘాను ఏర్పాటు చేశారు. శనివారం నాడు రాత్రి కవిటి మండలం ఇద్దివానిపాలెం సమీపంలో మత్య్సకారులు ఒడ్డుకు చేరుకొన్నారు. రాజపురం గ్రామంలో ఉన్న క్వారంటైన్ కు మత్స్యకారులను తరలించారు.

click me!