దీపావళినాడు టపాసులు పేలి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఒకరు మృతి చెందగా, హైదరాబాద్ లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
కృష్ణాజిల్లా : దీపావళిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. అయితే అక్కడక్కడా పండుగలో అపశృతులు కనిపించాయి. అగ్నిప్రమాదాలతో పాటు, పలువురు క్షతగాత్రులైన ఘటనలు అక్కడక్కడా కనిపించాయి. కృష్ణాజిల్లాలో దీపావళి పండుగరోజు విషాదం చోటు చేసుకుంది. మచిలీపట్నం శివారు నవీన్ మిట్టల్ కాలనీ సీతా నగర్ లో టపాసులు పెళ్లి 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. టపాసులు ఆరబెడుతుండగా అవి ఒక్కసారిగా పేలాయి. దీంతో పక్కనే ఉన్న ద్విచక్రవాహనంపై నిప్పులు పడడంతో ట్యాంక్ అంటుకుని వాహనం పేలిపోయింది.
దీంతో బాలుడు మంటల్లో చిక్కుకున్నాడు. ముందు టపాసులు పేలడం, ఆ తరువాత బైక్ పేలుడు శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటికి వచ్చిన తల్లిదండ్రులు, స్థానికులు.. బాలుడిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో సీతా నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణలోనూ ఇలాంటి ఘటనలు అక్కడక్కడా చోటు చేసుకున్నాయి. హైదరాబాదులో దీపావళి వేడుకల్లో టపాసులు కాలుస్తూ పలువురు గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం సరోజినీ దేవి కంటి ఆసుపత్రి కి తరలించారు. ఇప్పటివరకు 24 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో అత్యధిక మంది చిన్నారులే ఉన్నారు. గాయపడిన వారిలో 12 మంది ఆస్పత్రిలో అడ్మిట్ కావడంతో.. వారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిలో ముగ్గురిని ఇతర ఆసుపత్రులకు సిఫార్సు చేసినట్లు చెప్పారు.