ఏమిటీ ప్రోటెం స్పీకర్..? ఎలా, ఎవరు, ఎందుకు నియమిస్తారు..? అందరితో ప్రమాణస్వీకారం చేయించే ఆయన ప్రమాణం ఎలా? 

By Arun Kumar P  |  First Published Jun 19, 2024, 11:06 PM IST

దేశంలో కొత్తగా లోక్ సభ, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఏర్పడగానే వినిపించే పదం ప్రోటెం స్పీకర్. ఈ సమయంలో తప్ప మరెప్పుడూ ఈ పదాన్ని మనం వినం. మరి ఈ ప్రోటెం స్పీకర్ అంటే ఏమిటి? ఎవరిని నియమిస్తారు? ఎవరు నియమిస్తారు? 


అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుుడు,  డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. మంత్రులు కూడా బాధ్యతలు చేపట్టి ఎవరిపనుల్లో వారు బిజీ అయిపోయారు. ఇలా ఇప్పటికే నూతన పాలనాయంత్రాంగం సెట్ అయిపోయింది. ఇక మిగిలింది అసెంబ్లీ సమావేశాలే. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎంపిక కోసం రెండు రోజులపాటు అంటే ఈ నెల 21,22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 

అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించాల్సింది గోరంట్లను కోరారు. దీంతో  గోరంట్లతో ముందుగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించి ప్రోటెం స్పీకర్ గా నియమించనున్నారు. 

Latest Videos

గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రోటెం స్పీకర్ గా ఎమ్మెల్యేలతో ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ప్రోటెం స్పీకర్ అంటే ఏమిటి? ఆయనను ఎవరు నియమిస్తారు? ఎవరు ఇందుకు అర్హులు? అనేది తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.  

అసలేమిటీ ప్రోటెం స్పీకర్ : 

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. విదేశీ పాలననుండి విముక్తిపొందాక స్వపరిపాలన కోసం మనం రూపొందించుకున్నదే రాజ్యాంగం. అయితే ఇందులో ప్రోటెం స్పీకర్ అన్న పదమే లేదు. అంటే ఇది రాజ్యాంగబద్దమైన పదవి కాదని స్పష్టమవుతుంది. 

అయితే కొత్తగా ఎన్నికయిన లోక్ సభ, అసెంబ్లీలకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ల ఎంపికకు సమయం పడుతుంది. కాబట్టి అప్పటివరకు ఆయా సభల వ్యవహారాలు   రాష్ట్రపతి, గవర్నర్లు చూసుకోవచ్చు లేదంటే తమ ప్రతినిధిని నియమించవచ్చని రాజ్యాంగం చెబుతోంది. దీంతో లోక్ సభలో అయితే ఎన్నికైన ఎంపీల్లో ఒకరిని రాష్ట్రపతి... రాష్ట్రాల అసెంబ్లీల్లో అయితే ఎమ్మెల్యేల్లో ఒకరిని గవర్నర్ తన ప్రతినిధిగా నియమిస్తారు. అయనే ప్రోటెం స్పీకర్. 

ప్రోటెం స్పీకర్ బాధ్యతలు : 

రాజ్యాంగం ప్రకారం ప్రజలచే ఎన్నుకోబడిన ఎంపీలు లోక్ సభలో... ఎమ్మెల్యేలు రాజ్యసభలో ప్రమాణస్వీకారం చేయాల్సి వుంటుంది. ఇందుకోసం మాత్రమే ప్రోటెం స్పీకర్ ను ఎంపిక చేస్తారు. అయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనేవి రాజ్యాంగబద్ద పదవులు... వీరికి అధికారాలు వుంటాయి. కానీ   ప్రోటెం స్పీకర్ అనేది తాత్కాలిక పదవి... ఒక్కసారి స్పీకర్ ఎంపిక జరిగితే ఆటోమేటిక్ గా ఈ పదవిలోనివారు సాధారణ ఎమ్మెల్యేగా మారిపోతారు. కాబట్టి ప్రోటెం స్పీకర్ కు ప్రత్యేకంగా ఎలాంటి అధికారాలు వుండవు. 

ఎవరిని ప్రోటెం స్పీకర్ గా ఎంపికచేస్తారు : 

సాధారణంగా ఎన్నికైనవారిలో సీనియర్ సభ్యుడిని ప్రోటెం స్పీకర్ గా ఎంపికచేస్తారు. లోక్ సభలో అయితే ప్రధాని, లోక్ సభ వ్యవహారాల మంత్రి, రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి ఈ ప్రోటెం స్పీకర్ ను ఎంపికచేస్తారు. వీరు ఎంపికచేసే సభ్యుడినే రాష్ట్రపతిగాని, గవర్నర్లు గాని తన ప్రతినిధిగా (ప్రోటెం స్పీకర్) నియమిస్తారు. 

అయితే అందరిచేత ప్రమాణస్వీకారం చేయించే ప్రోటెం స్పీకర్ తో కేంద్రంలో అయితే రాష్ట్రపతి, రాష్ట్రంలో అయితే గవర్నర్లు ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత వారు కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ నియామకం జరగ్గానే ఇక ప్రోటెం స్పీకర్ ప్రస్తావన వుండదు. 

ప్రోటెం స్పీకర్ ఎంపికకు వయసు రిత్యా సినియారిటీని కాకుండా సభలో సినియారిటీని పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ సభలోని సీనియర్ సీఎంగా, మంత్రిగా వుండివుంటే ఆ తర్వాత సీనియారిటీ కలిగినవారిని నియమిస్తున్నారు. ఇలా సీనియర్ నే ప్రోటెం స్పీకర్ నియమించాలన్న నిబంధన ఏమీ లేదు... కానీ ఇది సభా సాంప్రదాయంగా మారింది. 

ఆంధ్ర ప్రదేశ్  విషయానికి వస్తే కొత్తగా ఏర్పడిన 16 శాసన సభకు ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించనున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి కంటే చంద్రబాబు నాయుడు సభలో సీనియర్. కానీ ఆయన ముఖ్యమంత్రిగా వుండటంతో గోరంట్ల ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించనున్నారు. ఆయనతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. 
 

click me!