IND vs AUS: ఫైనల్‌లో ఓటమి తర్వాత శుభ్‌మాన్ గిల్ తన బాధను వ్యక్తం చేశారు, 16 గంటలు గడిచినా గత రాత్రి ఓటమి తీరని బాధను మిగిల్చిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
Shubman Gill : భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. ఈ టోర్నీలో ఆది నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ లో తడబడటంతో కప్ చేజారింది. భారత ఆటగాళ్లు పోరాడినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో టీమిండియా ప్లేయర్లు సహా భారతీయ క్రికెట్ అభిమానులంతా ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఆటగాడు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో ఓటమి తర్వాత తన బాధను వ్యక్తం చేశాడు.
ఆ బాధ ఇంకా తగ్గట్లలేదు
దాదాపు 16 గంటలు గడిచిపోయాయి. అయినా.. గత రాత్రి ఓటమి తీరని బాధను మిగిల్చింది. కొన్నిసార్లు 100 శాతం కష్టపడ్డా.. ఆశించిన ఫలితం రాదు. మేము మా అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాం. కానీ ఈ అద్భుతమైన ప్రయాణంలో టీమిండియా బృందం గొప్ప స్ఫూర్తిని, అంకితభావాన్ని ప్రదర్శించింది. కానీ, ఈ టోర్నీ ప్రయాణంలో ప్రతి అడుగు విలువైనదే.. ఆటలో గెలుపోటములు సహజం. ఈ తరుణంలో మా అభిమానులు మాకు చాలా మద్దతు ఇచ్చారు, మేము గెలిచినా లేదా ఓడిపోయినా, అభిమానుల మద్దతు మాకు చాలా ముఖ్యం. అది మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇది అంతం కాదు.. ఆరంభం.. ఈ పోరాటం గెలిచే వరకు సాగుతుంది. జై హింద్’ అని గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది కాకుండా.. సోషల్ మీడియా వినియోగదారులు నిరంతరం వ్యాఖ్యానించడం ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి ఈ ప్రపంచకప్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసినా ఫైనల్ మ్యాచ్‌లో 7 బంతుల్లో 4 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బంతికి పెవిలియన్‌కు చేరుకున్నాడు.