World Cup 2023 Final: 2023 ప్రపంచ కప్‌లో భారత జట్టు ఓడిపోవడంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు.
World Cup 2023 Final: భారత్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ 2023 మహా టోర్నీలో టీమిండియా ఆద్యంతం అద్భుత ప్రదర్శన ఇచ్చింది. కానీ, ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచింది. ఆస్ట్రేలియా చేతిలో సొంత గడ్డపై టీమిండియా ఓటమి పాలుకావడంతో లక్షలాది మంది అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఐసీసీ టోర్నీల్లో తమకు తామే సాటి తమకు తామే పోటీ అన్నట్టుగా కంగారు జట్టు వ్యవహరించింది. రికార్డు స్థాయిలో ఆరోసారి విజేతగా నిలవగా.. మూడోసారి కప్‌ను ముద్దాడాలని భావించిన టీమిండియా కల కలగా మారింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన తుది పోరులో ఆస్ట్రేలియా చేతితో టీమిండియా ఓడిపోవడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
జట్టును ఓదార్చిన సచిన్
ఈ ఓటమి తర్వాత టీమిండియా మాజీ గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జట్టును ఓదార్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లందరి దగ్గరికి వెళ్లి వారిని ఓదార్చారు. వారు నిరాశకు లోనుకాకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. వారి వెన్నుదడుతూ వారి స్పూర్తి నింపారు సచిన్ టెండూల్కర్. ఆటలో గెలుపోటములు సహజమంటూ రోహిత్ సేనకు అండగా నిలిచారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లిని ప్రోత్సహిస్తూ కనిపించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ చాలా బాధపడ్డాడు. ఈ క్రమంలలో సచిన్ టెండూల్కర్ స్వయంగా అతని వద్దకు వెళ్లి మాట్లాడి ఓదార్చారు. ఈ టోర్నీలో టీమిండియా తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసిన మహ్మద్ షమీతో మాట్లాడి ధైర్యం చెప్పాడు.
అనంతరం సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేస్తూ.. 'ఆరోసారి ప్రపంచకప్ గెలిచి విశ్వ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు అభినందనలు. వరల్డ్ కప్ వంటి అత్యున్నత వేదికపై ముఖ్యమైన రోజున మెరుగైన క్రికెట్ ను ప్రదర్శించారు ' అంటూ ప్రశంసించారు. ఈ మెగా టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన టీమిండియా.. చివరి రోజు కలిసి రాకపోవడం హృదయ విదారకంగా ఉంది. ఆటగాళ్ళు, అభిమానులు, శ్రేయోభిలాషుల ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. వారు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఓటమి అనేది ఆటలో భాగం. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అని ట్వీట్ చేశారు.
2023 ప్రపంచకప్‌లో ఇన్విన్సిబుల్ టీమ్ ఇండియా ఫైనల్‌లో ఓడిపోయింది. ప్రపంచకప్ 2023లో తొలి మ్యాచ్ నుంచి సెమీఫైనల్ వరకు భారత జట్టు జైత్రయాత్ర కొనసాగించింది.గ్రూప్ దశలో ఆడిన మొత్తం 9 మ్యాచ్‌ల్లోనూ ఏకపక్షంగా విజయం సాధించి... పాయింట్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్‌లోనూ రోహిత్ సేన సులువుగా గెలిచింది. కానీ, ఫైనల్‌లో మాత్రం టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 240 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 43వ ఓవర్‌లోనే విజయం సాధించింది. ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది.