వైసిపి దాడులు భరించలేక అనేకమంది బీసీనేతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు.
గుంటూరు: రాష్ట్రంలో 50శాతంపైగా ఉన్న బీసీలపై కక్ష తీర్చుకోవడానికే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచాడనిపిస్తోందని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. ఆయన వ్యవహారాలు చూస్తుంటే ఖచ్చితంగా బీసీలపై కక్షసాధించడానికే ముఖ్యమంత్రి పదవి చేపట్టాడని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే ఆత్మకూరు విషయంలో ఏం జరిగిందో చూశామని... అదేవిధంగా ఈ ప్రభుత్వ పాలనలో టీడీపీకి చెందిన బీసీ నాయకులపై జరిగిన దాడులను కూడా చూస్తున్నామని అన్నారు.
వైసిపి దాడులు భరించలేక అనేకమంది బీసీనేతలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా చూస్తున్నామని పేర్కొన్నారు. బిసి నాయకులపై కక్షగట్టి దాడి చేయించడమే కాదు హత్యలు కూడా చేయించడం జరుగుతోందన్నారు.
undefined
అయితే ఈ ప్రభుత్వ చర్యలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు బయటపెడుతున్నారని... అనేకసార్లు మీడియా ద్వారా కూడా బీసీలను కాపాడుకునే ప్రయత్నం చేశారన్నారు. ఆయన చేసిన పోరాటం ద్వారానే బీసీలపై జరుగుతున్న దాడులు చాలావరకు తగ్గాయన్నారు. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలోకూడా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించడం... కోర్టులకు సరైన విధంగా ప్రభుత్వం వివరణ ఇవ్వలేకపోవడం వల్లే 34శాతం ఉన్న రిజర్వేషన్లు 24శాతానికి తగ్గాయని మండిపడ్డారు.
రిజర్వేషన్లపై మాట్లాడినందుకు అనేకమందిపై వైసీపీనేతలు దాడిచేసే ప్రయత్నం చేశారని... అసలు ఏం పాపం చేశారని బీసీలపై ఇంత వివక్ష? అని నిలదీశారు. రాజకీయంగా 16,700 మంది బీసీలు ఎదగకుండా విధ్వంసానికి నాంది పలికింది ఈ వైసీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు.
ఇవన్నీ ఒకెత్తయితే ఇప్పుడు కొత్తగా ఇండివిడ్యువల్ గా బీసీ నాయకుల్ని టార్గెట్ చేసి, వాళ్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసేవిధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురంలో జరిగిన సంఘటనే ఇందుకు ప్రత్యక్షసాక్ష్యమన్నారు. ఎవరూ చేయని పనిచేయడానికి ఎస్ఎం పురం గ్రామానికి చెందిన అవినాశ్ అనే అబ్బాయి ముందుకొచ్చాడని... ప్రజలకోసం ఆ ఊరిలో గుడిని కట్టడానికి ప్రయత్నించాడని అన్నారు. తనకు ఏమయినా పరవాలేదు గ్రామస్తులంతా పూజలు చేసుకోవడానికి ఆ గుడిని బాగుచేయాలని అనుకున్నాడని తెలిపారు.
2016లో దాన్ని సొంత ఖర్చులతో బాగుచేసే ప్రయత్నం చేశాడన్నారు. 90శాతం వరకు గుడిని కట్టడం పూర్తయిందని.... అంతలోనే ఎన్నికలు వచ్చాయని తెలిపారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చాక రాజకీయం చేసి అతడు గుడిని పట్టించుకోవడానికి వీల్లేదని చెప్పి బెదిరించారని అన్నారు. పోలీసులను అడ్డుపెట్టి రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్టో ఈ వైసీపీనేతలు సమాధానం చెప్పాలి అని అన్నారు.
అవినాశ్ తండ్రి శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులుగా అనేకరకాల సేవలందించడం జరిగిందన్నారు. అవినాశ్ తల్లి జడ్పీటీసీగా గెలిచి సేవలందించారని...ఈ విధంగా వారి కుటుంబానికి పేరు ప్రఖ్యాతులున్నాయని తెలిపారు. అలాంటి కుటుంబం చేసిన తప్పేంటి? అవినాశ్ పోలీసుల వేధింపులు భరించలేక, ముఖ్యంగా వైసీపీనేతల వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యాయత్నం చేశాడని అనురాధ ఆరోపించారు.
''తాను చనిపోతున్నట్లు చెప్పిమరీ (వీడియోద్వారా) అతను ఆత్మహత్య చేసుకోబోతుంటే అక్కడున్న పోలీసులు ఏం చేశారు? ఏ గుడ్డిగాడిద పళ్లు తోముతున్నారు? అతన్ని కాపాడాల్సిన అవసరం పోలీసులకు లేదా? పోలీస్ స్టేషన్ పైనుంచి దూకి మరీ ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ చెప్పిమరీ ఆ ప్రయత్నం చేయబోతే అతన్ని కాపాడాల్సిన అవసరం పోలీసులకు ఉందా..లేదా?
అతనికేదైనా జరిగి చనిపోతే పోలీసులకు ప్రమోషన్లు వస్తాయనా? లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన ఈ పోలీసులే ఈరోజు అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా పట్టించుకోలేదంటే, ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి?'' అంటూ మండిపడ్డారు.
''చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన ఆదరణ పథకాన్ని పక్కన పెట్టేశారు. ఇదివరకున్న బీసీ మంత్రులందరినీ జైలుపాలు చేశారు. ఎందుకండీ అంత కక్ష మీకు బీసీలంటే? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీలోని బీసీ నేతలుకూడా గమనించాలి. మంత్రి పదవులకోసం, ఛైర్మన్ పదవులకోసం కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి దగ్గర సాగిలపడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వారంతా ఇప్పటికైనా బీసీలకోసం పోరాడాలి'' అని సూచించారు.