బోటు ప్రమాదంలో జగన్ ఏ1... అవంతి శ్రీనివాస్‌ ఏ2...: పంచుమర్తి అనురాధ

By Arun Kumar PFirst Published Oct 23, 2019, 2:24 PM IST
Highlights

గోదావరి నదిలోొ జరిగిన బోటు ప్రమాదాన్ని జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. బాధితులను ఆదుకోడమే కాదు కనీసం బోటును బయటకు తీయడంలో కూడా ప్రభుత్వ అలసత్వం స్పష్టంగా కనిపిస్తుందని ఆమె ఆరోపించారు.  

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్టించుకోకపోవడం వల్లే కచ్చులూరు వద్ద గోదావరి నదిలో ప్రమాదానికి గురైన బోటు వెలికితీత ఆలస్యమైందని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారో ప్రభుత్వానికయినా స్పష్టత ఉందా? ఆమె ప్రశ్నించారు. 

300 అడుగుల లోతులో ఉన్న బోటును 500 అడుగుల ఎత్తు నుంచి సీఎం జగన్మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే చేయడం విడ్డూరంగా వుందన్నారు. అలా వెళ్లిన నాడే బోటు వెలికితీత ఈ ప్రభుత్వానికి చేతకాదనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని అనురాధ అన్నారు. 

గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 38 రోజులలో ఒక్క రోజు కూడా సీఎం ఘటనా స్థలికి వెళ్లి సమీక్ష చేయకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం వల్లే బోటు వెలికితీత ఆలస్యమైందన్నారు. 

ఎవరి ఫోన్‌ కాల్‌ వల్ల బోటు కదిలిందో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదన్నారు. వైఎస్సార్‌సిపి నాయకుల బినామీలను కాపాడేందుకే విచారణ జరపడం లేదా..? అని అనురాధ అనుమానం వ్యక్తం చేశారు. 

బోటులోని ఏసీ ఛాంబర్‌లో ఆధారాలున్నాయని బాధిత కుటుంబ సభ్యులు చెబుతుంటే... ముక్క ముక్కలుగా తీసి ఆధారాల్లేకుండా చేశారని మండిపడ్డారు. బోటు ఎక్కడుంది..? ఎన్ని అడుగుల లోతులో ఉంది..? అని తెలుసుకోవడానికి అండర్‌ వాటర్‌ కెమెరాలను వినియోగించి విజువల్స్‌ తీసే అవకాశం ఉన్నా... సాంకేతికతను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. 

ధర్మాడి సత్యం బృందం బోటు తీస్తామని పదేపదే చెప్పినా.. 20 రోజులు పాటు ప్రభుత్వం తాత్సారం చేసిందన్నారు. ప్రమాదంలో మృతుల సంఖ్యపైనా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదని.. జీవో నెం.242లో 61 మంది అని ఉంటే.. జీవో నెం.79లో 76 మంది చనిపోయినట్లు తెలిపి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. 

మరోవైపు 93 మంది చనిపోయినట్లు హర్షకుమార్‌ గారు సుప్రీంకోర్టులో వేసిన పిల్‌ను ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినా మృతుల సంఖ్యపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతోందని సూటిగా ప్రశ్నించారు. 

బోటు ప్రమాద ఘటనలో ఏ1 ముద్దాయి సీఎం జగన్మోహన్‌రెడ్డి అయితే.. ఏ2 ముద్దాయిగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేరు చేర్చాలని పంచుమర్తి అనురాధ డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాల గోడు పట్టకుండా మంత్రి అవంతి శ్రీనివాస్‌ విదేశీ పర్యటనకు వెళ్లారంటేనే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందని విమర్శించారు. 

చివరకు టీడీపీ నాయకుల పోరాటం, సుప్రీంకోర్టులో హర్షకుమార్‌ గారి పిల్‌ వేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడం బాధాకరమన్నారు. 38 రోజుల తర్వాత బోటు వెలికితీసిన అసమర్థతను.. సీఎం జగన్‌ చిత్తశుద్ధిగా మంత్రి కన్నబాబు వర్ణించడం సిగ్గుచేటన్నారు.

తెలుగుదేశం హయాంలో జరిగిన ప్రమాదంలో బాధిత కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేసిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు బాధిత కుటుంబాలకు ఇచ్చిన ఎక్స్‌గ్రేషియా వివరాలను ఎందుకు బయటకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. 

ప్రమాదంలో కొందరు ప్రయాణికులను కాపాడిని కచ్చులూరు గ్రామ ప్రజలకు ఇస్తామన్న నగదు ప్రోత్సాహకం ఇవ్వడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పెళ్లిల్లు, పేరంటాలకు ఇచ్చిన ప్రాధాన్యత మృతుల కుటుంబాలకు సీఎం జగన్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.

ఇప్పటికైనా ఎంతమంది చనిపోయారు..? బోటుకు అనుమతించిన వ్యక్తి పేరు, బాధిత కుటుంబాలకు ఇచ్చిన ఎక్స్‌గ్రేషియా వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బహిర్గత పరచాలని అనురాధ డిమాండ్‌ చేశారు.

 

click me!