కృష్ణా నది కరకట్టపై ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోోటుచేసుకుంది. 30మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఆర్టీసి బస్సు అదుపుతప్పి కృష్ణానది వైపు దూసుకెళ్లింది.
విజయవాడ: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి వద్ద ఆర్టీసి బస్సు ప్రమాదానికి గురయ్యింది. అదుపుతప్పి కృష్ణానది వైసు దూసుకెళ్లిన బస్సును డ్రైవర్ అత్యంత చాకచక్యంగా అదుపుచేశాడు. దీంతో బస్సులోని 30 మంది ప్రయాణికులు సురక్షితంగా ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
బస్సు కృష్ణానదిలోకి దూసుకెళ్లివుంటే ఘోరం జరిగివుండేది. కరకట్టపై తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంతో భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే 30మంది కృష్ణానదిలో పడి బలయ్యేవారని... ఈ ప్రమాదాన్ని దృష్టిలో వుంచుకుని అయినా నాయకులు, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో కూడా కృష్ణా నది కరకట్టపై అనేక ప్రమాదాలు జరిగాయి. అయితే అవన్నీ చిన్నాచితకావి కావడంతో అటు నాయకులు, అధికారులు ఇటు ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆర్టీసి బస్సు ప్రమాదం 30 మందిని బలితీసుకునేలా కనిపించడంతో కరకట్టపై భద్రత చర్చనీయాంశంగా మారింది.