ఏపిలో లాక్ డౌన్ ఎఫెక్ట్... గ్రామాల మధ్య నిలిచిపోతున్న రాకపోకలు

By Arun Kumar PFirst Published Mar 23, 2020, 6:40 PM IST
Highlights

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన విషయం  తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టణాల నుండి గ్రామాలబాట పడుతున్న వారిని గ్రామస్తుల అడ్డుకుంటున్న సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్నాయి. 

విజయవాడ:  ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి భారత్ లోనూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. దేశం యావత్ కర్ఫ్యూ పాటిస్తున్న వైరస్ తగ్గుముఖం పట్టడంలేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 400కు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా 9మంది  మృత్యువాతపడ్డారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్రాలు ఇదివరకు ఇతర రాష్ట్రాల నుండి రాకపోకలను నిలిపివేయగా తాజాగా ఒకేరాష్ట్రంలోని  గ్రామాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. 

కరోనా మహమ్మారిని తరిమేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాలోకి కొన్ని గ్రామాల ప్రజలు మరో అడుగు ముందుకేశారు.  విజయవాడ నగరంలో ఇప్పటికే పాజిటివ్ కేసు నమోదయిన నేపథ్యంలో అంబాపురం, నైనవరం గ్రామాల ప్రజల అప్రమత్తమయ్యారు. గ్రామస్థులంతా ఏకమై ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తమ గ్రామంలోకి బయట వ్యక్తులను అనుమతించకూడదని అంబాపురం, నైనవరం గ్రామస్ధులు నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా విజయవాడ, హైద్రాబాద్ నుంచి  అంబాపురం వస్తున్న బయట వ్యక్తులను అడ్డుకుంటున్నారు గ్రామస్ధులు. రోడ్డుకు అడ్డంగా బైక్ లు ఏర్పాటు చేసి బయట నుంచి  వస్తున్నవారిని  అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. 

గ్రామంలోని రానివ్వకపోవడంతో కొందరు గ్రామస్ధులతో వాగ్వివివాదానికి దిగుతున్నారు. అయితే బయటినుండి వచ్చి కరోనా వైరస్ ను గ్రామస్తులకు అంటించొద్దని.. దయచేసి వెళ్లిపోవాలని గ్రామస్తులు వారికి సర్దిచెప్పి వెనక్కి పంపిస్తున్నారు. 

ప్రభుత్వం 31 వరకు లాక్ డౌన్ విధించింది కాబట్టి అప్పటివరకు ఎట్టి పరిస్ధితుల్లో గ్రామంలోకి ఎవ్వరినీ రానివ్వబోమని... ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని నిర్ణయించుకున్న ఆ గ్రామాల యువకులు వెల్లడించారు. 

click me!