లాక్ డౌన్: కూరగాయలు పంచిన టీడీపీ ఎంపీ కేశినేని నానిపై కేసు

By telugu teamFirst Published May 3, 2020, 8:16 AM IST
Highlights

పేదలకు కూరగాయలు చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై లాక్ డౌన్ ఉల్లంఘించారనే ఆరోపణపై పోలీసులు కేసు నమోదు చేశారు. దానిపై కేశినేని నాని తీవ్రంగా ప్రతిస్పందించారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై కేసు నమోదు చేశారు. మరో 13 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణపై వారి మీద కొత్తపేట పోలీసులు కేసులు పెట్టారు. 

కేశినేని ఆధ్వర్యంలో పాతబస్తీలోని 47వ డివిజన్ గుజ్జారి యల్లారావు కూరగాయల మార్కెట్ సముదాయం ఎదురుకు ఇటీవల పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భౌతిక దూరం పాటించలేదని, గుంపులు గుంపులుగా ఉన్నారని, ఇది కరోనా వ్యాప్తికి కారణమవుతుందని పోలీసులు అన్నారు. దాంతో నానితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ నాగుల్ మీతో పాటు 13 మందిపై కేసు నమోదు చేశారు.

పోలీసులు పెట్టిన కేసులపై కేశినేని నాని తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ప్రతిస్పందించారు. కరోనా విపత్తులో తిండి లేక అలమటిస్తున్న పేదలకుసహాయం చేసినందుకు దొంగ కేసులు బనాయించిన విజయవాడ నగర పోలీసులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. 

"మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టినా భయపడేది లేదు, ఆకలితో అలమటిస్తున్నవారిని ఆదుకోవడం ఆపేది లేదు. ప్రజలు ఎన్నుకున్నది వారు ఆపదలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోవడానికి కాదు" అని కేశినేని అన్నారు.

దానికి తోడు, వీళ్ల మీద ఎన్ని కేసులు నమోదు చేశారని విజయవాడ పోలీసులను ప్రశ్నిస్తూ వైసీపీ నేతల ఫొటోలను తన వ్యాఖ్యకు జత చేశారు. 

click me!