గుంటూరు జిల్లా మాచర్లలో తనపై జరిగిన దాడిపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. ఇవాళ దాడిలో ధ్వంసమైన కారును తీసుకుని ఆయన సిపి ద్వారకాతిరుమల రావు కార్యాలయానికి వెళ్లారు.
విజయవాడ: గుంటూరు జిల్లా మాచర్లలో తనపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో భద్రత కల్పించాలని కోరుతూ టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావును కోరారు. దాడిలో పూర్తిగా ధ్వంసమైన తన కారును విజయవాడలోని సీపీ ఆఫీసుకు ఉమ తీసుకువెళ్లారు. తనపై ఎంత దారుణంగా దాడి జరిగిందో తెలపడానికి ఇదే నిదర్శనమంటూ కారును సిపికి చూపించారు. కాబట్టి తనకు గన్ మెన్లను కేటాయించి రక్షణ కల్పించాలని సిపిని కోరారు.
అనంతరం ఉమ మీడియాతో మాట్లాడుతూ... మాచర్లలో వైసీపీ నేతల దాడి ఘటనను సీపీకి నిశితంగా వివరించినట్లు తెలిపారు. ఈ దాడిని చూశయినా తనకు ఏ స్థాయిలో ప్రాణహాని ఉందో గుర్తించాలని... వెంటనే రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో తనకున్న రక్షణను తగ్గిస్తూ గన్‌మెన్లను తొలగించిన విషయాన్ని కూడా సిపితో ప్రస్తావించినట్లు ఉమ తెలిపారు.
undefined
read more మీ ఇంట్లోని మహిళలకు ఆ పరీక్ష చేయించు...: వైసిపి నేతపై అనిత ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్రం లో రౌడీ రాజ్యం కొనసాగుతోందని ఉమ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసిపి అరాచకాలకు పాల్పడుతోందని... టిడిపి అభ్యర్థులను నామినేషన్లు వెయ్యనివ్వకుండా పత్రాలను లాక్కుని చించేస్తున్నారని ఆరోపించారు. నామినేషన్లకు చివరి రోజయిన బుధవారం మాచర్లలో తమపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలందరూ చూశారన్నారు. ఇది సాధారణంగా జరిగిన దాడి కాదని... ఎన్నికల ముసుగులో తమను చంపడానికే జరిగిందని ఆరోపించారు. మాపై హత్యాయత్నం జరిగింది మాచర్లలో అయినా స్కెచ్ మాత్రం తాడేపల్లి కార్యాలయం నుంచే జరిగిందన్నారు.
మమ్మల్ని చంపాలని మూడు చోట్ల ప్రయత్నం చేసినా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డామని అన్నారు. తనతో పాటు బుద్దా వెంకన్న స్వల్ప గాయాలతో బయటపడగా తమతో పాటు కారులో వున్న హైకోర్టు న్యాయవాది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం తన సొంతానికి పోలీసు వ్యవస్థ ను వాడుకుంటోందని ఆరోపించారు. మాజీ సిఎం చంద్రబాబు వచ్చినా డిజిపి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. అడిషనల్ డిజికి అన్నీ వివరించామని... అయినా సరయిన రీతిలో విచారణ జరగలేదని... మొక్కుబడిగా కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారని అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ లను రాజకీయాల్లో లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
read more పల్నాడులో పోలీసుల అత్యుత్సాహం... ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
పోలీసులకు తాము సమాచారం ఇచ్చి బయలు దేరగా వారు వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి వర్గాలని సమాచారం ఇచ్చారని అన్నారు. అందువల్లే తాము ఎక్కడున్నామో పక్కా సమాచారం అందుకుని ఓ పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. ఇప్పటికే డిజిపికి అన్ని విషయాలు తెలియచేసినా ఎలాంటి స్పందన లేదని... అందువల్లే పోలీసులపై నమ్మకం పోయిందన్నారు.
పోలీసులే తమ సమాచారాన్ని వైసిపి నాయకులకు చేర వేస్తున్నారని అన్నారు. చంద్రబాబుతో సహా అందరు టిడిపి నేతల ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయని ఆరోపించారు. ఈ హక్కు ఎవరిచ్చారు...? ఇలా చేయడం కంటే చంపేయడమే మంచిది... అయినా రేపయినా మమ్మల్ని చంపాలని చూస్తారు అని బోండా ఉమ ఆరోపించారు.