ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను సీఎం జగన్ సతీపమేతంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం, గవర్నర్ పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు గంటసేపు వీరిద్దరు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది.
undefined
సీఎం క్యాంప్ కార్యాలయం నుండి నేరుగా విజయవాడలోని రాజ్ భవన్ కు జగన్, భారతి దంపతులు చేరుకున్నారు. మొదట గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మొక్కలను బహూకరించారు. అనంతరం గవర్నర్ దంపతులను సీఎం దంపుతులు శాలువాతో గౌరవించి జ్ఞాపికను అందించారు.
ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు కూడా సీఎం దంపతులకు శాలువాలు కప్పి జ్ఞాపికను అందించారు. అనంతరం బిశ్వభూషన్, జగన్ లు గంటసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిద్దరు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా రాజధాని మార్పు అంశానికి సంబంధించిన విషయం గురించి సీఎం జగన్ గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిరసనలపై గవర్నర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా నూతనంగా ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాల గురించి సీఎం గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. ఇలా దాదాపు గంటకు పైగా వీరిద్దరి మధ్య భేటీ కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం సీఎం దంపతులు తిరిగి నేరుగా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.