Sep 3, 2022, 4:37 PM IST
అభివృద్ధి పేరుతో చెట్లుచేమలను నరికి వేస్తున్నారు. పశుపక్ష్యాదుల ఆవాసాలను నాశనం చేస్తున్నారు. తాజాగా ఓ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా వందలాది పక్షులు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలోని తిరురంగడి ప్రాంతంలో జరిగింది. మలప్పురంలో జాతీయ రహదారి-66 అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్లను నరికే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మలప్పురంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టును జేసీబీతో కూల్చివేశారు. అయితే ఆ చెట్టుపై అనేక పక్షులు గూళ్లు కట్టుకుని.. గుడ్లు పెట్టి.. పిల్లలను పొదిగాయి. ఒక్కసారిగా చెట్టును కూల్చివేయడంతో వందలాది పక్షులు, వాటి పిల్లలు వాటి గూళ్లలో నుంచి ఎగరలేక..నేలకు బలంగా తాకి చనిపోయాయి. కొన్ని పక్షులు ఎగిరి ప్రాణాలు దక్కించుకున్నాయి. ఆ చెట్టు మీదున్న పక్షుల గూళ్లు కూడా ధ్వంసమయ్యాయి.