తిరుమల బ్రహ్మోత్సవాలు డే6 హ‌నుమంత వాహ‌నంపై శ్రీవారు

Oct 9, 2024, 2:34 PM IST

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది.