అవసరాలు తీరిస్తేనే టిడిపిలో పెద్దపదవులు... ఐ-టిడిపి కాదది ఇడియట్స్ టిడిపి: మంత్రి రోజా

Oct 9, 2022, 12:08 PM IST

విజయవాడ : టిడిపి అంటే తెలుగు దుర్యోధన, దుశ్శాసనుల పార్టీగా మారిందని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి  ఆర్కే రోజా ఎద్దేవా చేసారు.  రాష్ట్రంలో టిడిపి నేతలే యువతులు, మహిళలపై అత్యాచారాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని... వీటిపై చంద్రబాబు, లోకేష్ నోరు మెదపరు ఎందుకు..? అని నిలదీసారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని.... ఇది సీఎం జగన్, వైసిపి ప్రభుత్వ ఫెయిల్యూర్ అన్నట్లుగా టిడిపి ప్రచారం చేయడాన్ని రోజా తప్పుబట్టారు. 

మొన్న టిడిపి నేత వినోద్ జైన్ వల్ల తొమ్మిదో తరగతి మెరిట్ విద్యార్థిని సూసైడ్... నిన్న సత్యసాయి జిల్లాలో ఐటిడిపి నాయకుడు సోషల్ మీడియా ద్వారా లైంగిక వేధింపులతో సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్నారని రోజా అన్నారు. నిందితుడు ఇంతియాజ్ టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్, అనితతో దిగిన ఫోటోలున్నాయన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం చేసేవారు, అఘాయిత్యాలకు పాల్పడేవారికి, అవసరాలు తీర్చేవారికే టిడిపిలో పెద్ద పదవులు వస్తాయన్నారు. నీ మానసపుత్రిక ఐటిడిపిలో మెంబర్ అఘాయిత్యానికి పాల్పడితే నీ ట్విట్టర్ ఎందుకు మూగబోయింది? ఐ-టీడీపీ అంటే.. ఇడియట్స్ టీడీపీ గా మారిందంటూ రోజా ధ్వజమెత్తారు.