WTA: కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చైనాకు అంతర్జాతీయ మహిళల టెన్నిస్ సమాఖ్య షాకిచ్చింది. ఆ దేశానికి చెందిన పెంగ్ షువాయి ఆచూకీ కనిపించకుండా పోవడంతో ఆ దేశంలో జరిగే కీలక టోర్నీలన్నింటినీ నిలిపేసింది.
మహిళల టెన్నిస్ సమాఖ్య (డబ్ల్యూటీఏ) చైనాకు షాకిచ్చింది. ఆ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి ఆచూకీ, భద్రతా విషయాలపై Womens Tennis Association ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ దేశం ఆతిథ్యమివ్వనున్న అంతర్జాతీయ టెన్నిస్ పోటీలను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఛైర్మన్ స్టీవ్ సిమన్ గురువారం కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో తమకు అన్ని రకాల మద్దతు ఉందని ఆయన తెలిపారు. హాంకాంగ్ తో పాటు చైనాలో అన్ని చోట్ల జరగాల్సిన Tennis పోటీలను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
చైనా టెన్నిస్ క్రీడాకారిణి Peng Shuai.. ఆ దేశ ప్రభుత్వానికి చెందిన కీలక నేత, మాజీ వైస్ ప్రీమియర్ జాంగ్ గవోలి తనపై లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని గతనెల 2న తీవ్ర ఆరోపణలు చేసింది. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేసింది. అయితే అదే సమయంలో ఆమె కనిపించకుండా పోవడంతో టెన్నిస్ ప్రపంచం ఆందోళనకు గురైంది.
undefined
ఈ నేపథ్యంలో పెంగ్ ఆచూకీ తెలపాలని కోరుతూ ప్రపంచ టెన్నిస్ క్రీడాకారులతో పాటు Chinaలో ఓ చిన్న పాటి ఉద్యమమే జరిగింది. అయితే పెంగ్ కు సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలను తన అనుకూల మీడియాలో బయటపెట్టిన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం.. ఆమె క్షేమంగానే ఉన్నట్టు నమ్మబలికింది. చివరికి ఇటీవలే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం చీఫ్ థామస్ బాక్ తో కూడా పెంగ్ వీడియో కాల్ మాట్లాడినట్టు వార్తలు వచ్చినా ఇదదంతా చైనా కుట్రలో భాగమే అనే వాదనలు వినిపించాయి. ఆమె భద్రత, ఆచూకీ వివరాలు తెలపకుంటే చైనాలో త్వరలో జరుగబోయే ప్రపంచ క్రీడలన్నింటినీ నిలిపివేస్తామని ప్రపంచ దేశాలు హెచ్చరించాయి. అయినా చైనా దీనిని పట్టించుకోలేదు. ఇప్పటివరకు పెంగ్ షువాయి ఆచూకీ తెలపలేదు.
ఇక తాజాగా డబ్ల్యూటీఏ ఛైర్మన్ స్టీవ్ సిమన్ స్పందిస్తూ.. పెంగ్ తనకు మెయిల్ చేయడం, అందులో ఆమె సురక్షితంగానే ఉన్నట్టు పేర్కొనడంపై తనకు అనుమానాలున్నాయని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. 2022 లో చైనాలో జరిగే ఈవెంట్లను నిర్వహిస్తే మా ఆటగాళ్ల, సిబ్బంది అందరూ ఎదుర్కునే ప్రమాదాల గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను..’ అని అన్నారు. పెంగ్ షువాయి లేవనెత్తిన ఆరోపణలు ఆందోళనకరమని, ఆ సమస్యను పరిష్కరించకుంటే మహిళల సమానత్వం దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ నిషేధాని కంటే ముందు కూడా చైనాలో సుమారు 11 టోర్నీలు జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాటిని రద్దు చేయడమో లేదంటే వేదికలను మార్చడమో చేశారు. ఇక తాజాగా డబ్ల్యూటీఏ నిర్ణయంతో ఆ దేశానికి పెద్ద ఎదురుదెబ్బే అని విశ్లేషకులు భావిస్తున్నారు.