భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఇచ్చింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లోనే ఆరో సీడ్ జోడీకి దిమ్మతిరిగే షాకిచ్చింది.
మహిళల డబుల్స్ మాజీ వరల్డ్ నం.1, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఇచ్చింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో సానియా మీర్జా జోడీ అదిరే ఆరంభం సాధించింది.
మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లోనే ఆరో సీడ్ జోడీకి దిమ్మతిరిగే షాకిచ్చింది. ఒక గంట 27 నిమిషాల పాటు సాగిన తొలి రౌండ్ మ్యాచ్‌ను 7-5, 6-3తో సానియా మీర్జా జోడీ గెలుచుకుంది. అమెరికా భాగస్వామి బెతాని మాటెక్ శాండ్స్‌తో కలిసి ఆరో సీడ్ అమెరికన్, చిలీ కాంబోను సానియా మీర్జా చిత్తు చేసింది.
undefined
తొలి సెట్‌లో ఒత్తిడి సానియా, మాటెక్ జంటపైనే కనిపించింది. సానియా జంట సర్వ్ చేసిన మూడో గేమ్‌లో ఏడు డ్యూస్ ఎదురయ్యాయి. మాటెక్ మూడు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడినా.. చివర్లో మూడు బ్రేక్ పాయింట్లతో మెరిసింది.
తొలి సెట్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం రెండుసార్లు లభించినా సానియా జోడీ సద్వినియోగం చేసుకోలేదు. రెండో సెట్ ఆరంభంలోనే ప్రత్యర్థి సర్వీస్‌ను అలవోకగా బ్రేక్ చేసి 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.
ఆరంభంలోనే ఆధిక్యం అందుకున్న సానియా జోడీ.. మ్యాచ్‌లో మళ్లీ వెనుకడుగు వేయలేదు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడీ దివిజ్ శరణ్, రోహన్ బోపన్నలకు చుక్కెదురైంది. 11వ సీడ్ రోజర్ వాసెలిన్, హెన్రీలు 7-6(8-6), 6-4తో బోపన్న, దివిజ్‌లపై విజయం సాధించారు.
జ్వెరెవ్ దూకుడు ...
నాలుగో సీడ్, స్టార్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) దూకుడు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ అలవోక విజయం సాధించాడు. 7-5, 6-2, 6-3తో అమెరికా ఆటగాడు టాన్నిస్‌పై గెలుపొందాడు.
13 ఏస్‌లతో మెరిసిన జ్వెరెవ్.. ఐదు బ్రేక్ పాయింట్లు సాధించాడు. పాయింట్ల పరంగా 97-64తో ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించాడు. ఏడో సీడ్ మాటో బెరాటిని 6-3, 6-4, 7-6(7-4)తో బొటిక్ వాన్‌పై విజయం సాధించాడు.
20 ఏస్‌లతో విరుచుకుపడిన బెరాటిని మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. 13వ సీడ్ మోన్‌ఫిల్స్‌కు రెండో రౌండ్లో ఓటమి ఎదురైంది. స్పెయిన్ ఆటగాడు పెడ్రో మార్టినెజ్ 6-3, 6-4, 4-6, 7-6(7-5)తో మోన్‌ఫిల్స్‌ను మట్టికరిపించాడు. మోన్‌ఫిల్స్ 21 ఏస్‌లతో మెరిసినా.. మ్యాచ్‌ను మార్టినెజ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అమెరికా ఆటగాడు శామ్ ఖురేషి 5-7, 7-6(7-4), 3-6, 2-6తో ఆస్ట్రేలియా ఆటగాడు జేమ్స్ డక్‌వర్త్ చేతిలో పరాజయం పాలయ్యాడు. 17వ సీడ్ చిలీ ఆటగాడు క్రిస్టియన్ గారిన్ 7-6 (7-3), 6-2, 2-6, 7-6(7-5)తో మార్క్ పోల్‌మాన్స్ (ఆస్ట్రేలియా)పై నాలుగు సెట్ల మ్యాచ్‌లో పైచేయి సాధించాడు.
బార్టీ జోరు...
ఇక మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆష్లె బార్టీ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్‌లో 6-4, 6-3తో వరల్డ్ నం.1 అలవోక విజయం నమోదు చేసింది. రష్యా అమ్మాయి అనా బ్లింకోవా గట్టిగా ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది.
ఐదు ఏస్‌లు కొట్టిన బార్టీ.. ఆరు బ్రేక్ పాయింట్లు సాధించింది. 77-63 పాయింట్లతో వరుస సెట్లలోనే మూడో రౌండ్ బెర్త్ సొంతం చేసుకుంది. అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్ 7-5, 6-4తో మరియా సక్కరి (గ్రీసు)ను ఇంటిముఖం పట్టించింది.
ఫ్రెంచ్ ఓపెన్‌లో మెరిసిన మరియా వింబుల్డన్‌లో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. జర్మనీ అమ్మాయి అండ్రియా పెట్కోవిక్‌పై 7-5, 6-4తో బార్బరా క్రజికోవా గెలుపొందింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌కు తొలి సెట్లో ప్రతిఘటన ఎదురైనా.. నాలుగు బ్రేక్ పాయింట్లతో అదరగొట్టింది.
కరొలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 5-7, 6-3తో మూడు సెట్ల పోరులో ఇటలీ అమ్మాయి కామిలాపై విజయం సాధించింది. 11 ఏస్‌లు కొట్టిన ముచోవా ఆరు బ్రేక్ పాయింట్లు సాధించింది. అమెరికా అమ్మాయి కోకో వాండెవేగ్‌పై 4-6, 6-2, 6-2తో కటెరినా సైనికోవా మూడు సెట్ల మహా పోరులో గెలుపొందింది. నాలుగు బ్రేక్ పాయింట్లతో మెరిసిన సైనికోవా.. అమెరికా ప్లేయర్‌పై పైచేయి సాధించి మూడో రౌండ్‌కు చేరుకుంది.